ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) సిఫారసుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం...
- సూత్రప్రాయంగా అంగీకరించామని సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) సిఫారసుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ సిఫారసు అమలుకు సంబంధిత చట్టానికి సవరణలు చేయాల్సి ఉందని, న్యాయ శాఖ ఆ పనిలోనే ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ పీఎల్ నరసింహ కోర్టుకు విన్నవించారు.
ఎన్నారైలకు ఓటుహక్కు అవసరమేనని, ఆ సిఫారసును ఆమోదించాలని సూత్రప్రాయంగానైనా నిర్ణయం తీసుకున్నందున అమలు విషయంలో తీసుకున్న తదుపరి చర్యల గురించి తెలపాలని, ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది.
ఎన్నారైలకు ఈ బ్యాలెట్, ప్రాతినిధ్య ఓటు విధానాల ద్వారా ఓటుహక్కు కల్పించాలన్న ఈసీ సిఫారసులపై స్పందించాలంటూ గత నవంబర్ 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఉప కమిషనర్ వినోద్ జుట్షి నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికలో ఎన్నారైల ఓటుహక్కుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సిఫారసు చేసింది.