రైల్వే బడ్జెట్ నజరానా: రెండు రాష్ట్రాలకూ మొండిచేయి

రైల్వే బడ్జెట్ నజరానా: రెండు రాష్ట్రాలకూ మొండిచేయి - Sakshi

తెలుగింటికో కమిటీ

ప్రస్తుతం అమల్లో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులపై కమిటీ వేశాం.. 

ఆ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్న రైల్వే మంత్రి సదానంద గౌడ 

తెలంగాణకు ఒక ప్రీమియం రైలు.. ఏపీకి ఏసీ డైలీ ఎక్స్‌ప్రెస్

రెండు రాష్ట్రాలకు మూడు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు

మిగిలిన అంశాల్లో కనిపించని మన రాష్ట్రాలు

  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ మొండిచేయి చూపారు. ఒకట్రెండు మెరుపులు మినహా రైల్వే బడ్జెట్‌లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. కొన్ని కొత్త రైళ్లు ఇచ్చారు తప్పితే, మౌలిక వసతులకు సంబంధించి కొత్తగా లబ్ధి కనిపించలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రూ. 20,860 కోట్ల అంచనా వ్యయంతో 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు జరిపిన తరువాత వారి అవసరాలనుబట్టి పూర్తిచేసేందుకు యత్నిస్తామని చెప్పారు. 

 

దేశవ్యాప్తంగా 18 కొత్త రైల్వే మార్గాలకు సర్వే పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందినవి ఒక్కటీ లేదు. అలాగే డబ్లింగ్, గేజ్ మార్పిడి పనుల్లోనూ చోటు దక్కలేదు. రైళ్ల పొడిగింపులోనూ మన సర్వీసులేవీ లేవు. దేశవ్యాప్తంగా ఐదు జనసాధారణ్ రైళ్లు ప్రవేశపెట్టినా వాటిలోనూ అంతే. తీర్థయాత్రల కోసం ప్రవేశపెడుతున్న ప్రత్యేక రైళ్లలోనూ మన ప్రస్తావనే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల వినతులకు మోక్షం లభించలేదు. ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట ప్రత్యేక డివిజన్ ప్రతిపాదనలను రైల్వే మంత్రి పట్టించుకోలేదు. 

 

రెండు మూడేళ్ల క్రితం ప్రారంభించిన సర్వే పనులకు కూడా ఐదారు లక్షలు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అలాగే స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాల ప్రస్తావనే లేదు. దేశ రాజధానిని కలుపుతూ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఏసీ ఎక్స్‌ప్రెస్ కేటాయింపు మాత్రమే ఊరట కలిగించే అంశం. జనసాధారణ్ రైళ్లే కాదు.. ప్యాసింజర్, మెమూ, డెమూ రైళ్లలో రెండు రాష్ట్రాలకూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. రైళ్ల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులూ ఒక్కటీ లేవు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top