చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే ఇబ్బందా?

Netizens slam News chennal for sharing a video demeaning the use of Saree

భారతదేశంలోనే కాక దేశ, విదేశాలలో కూడా భారత సాంప్రదాయాల్ని పాటించే ఎందరో స్త్రీలు భారతీయ స్త్రీకి చీరే అందమంటారు. చీరకట్టుకు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్ని రకాల మోడ్రన్‌ డ్రెస్సులున్నా చీర అందం చీరదే. విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడాన్ని చాలా ఇష్టంగా భావిస్తుంటారు. అయితే తాజాగా ‘చీరలోని చెడ్డదనం తెలుసుకో’ అంటూ ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. చీర కట్టుకుంటే సవాలక్ష ఇబ్బందులు వస్తాయంటూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. అయితే  చీర వీడియోను చూసి నెటిజన్లు మాత్రం భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా బాణాసంచాపై పడ్డారు, ఇప్పుడు మీ కళ్లు చీరలపై కూడా పడ్డాయా అని నిప్పులు చెరిగారు.

చీర కట్టుకుంటే చాలా ఇబ్బందట. చీర ధరించి ఆఫీసుకు వెళ్తే నరకమేనంటూ... ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఒక మహిళ చీర కట్టుకొని ఆఫీసుకు వస్తే ఎన్ని రకాల అవస్థలు ఎదురవుతాయన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ కంటెంటే ఇప్పుడు వివాదానికి కారణమైంది. మహిళలు చీర కట్టుకొని ఆఫీసుకు వెళ్లే సరిగా నడవలేరట. అందరూ పెళ్లయిందా అని అడుగుతారట. పైగా ఆంటీ అని పిలుస్తారట. పురుష ఉద్యోగులైతే గుచ్చి గుచ్చి చూస్తారంటూ ఆ వీడియోలో ఇష్టం వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా చీర కట్టుకుంటే టాయ్‌లెట్‌కు వెళ్లడం కూడా కష్టమంటూ తెగ ఇదైపోయారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వివాదం రేపింది. జనాల నుంచి సానుకూల స్పందన వస్తుందని వీడియో రూపొందించినవాళ్లు ఆశిస్తే, తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సేషనలిజం కోసం ఇలాంటి చీప్ ట్రిక్‌లు ప్లే చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో చీర కట్టుకునే ప్రతి మహిళ మనోభావాన్ని దెబ్బతీసిందని కొందరు విమర్శిస్తే, ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి వాంతులొచ్చే వీడియోలకు దిగజారిపోయిందా అని మరికొందరు దుయ్యబట్టారు. ఇంకొందరు నెటిజన్లు తిట్టిపోయడంతోనే సరిపెట్టకుండా  చీర విశిష్టత గురించి ఫోటోలు పెట్టి క్లాసులు పీకారు.

ఝాన్సీ లక్ష్మీబాయి చీర కట్టి మరీ యుద్ధరంగంలోనే చెలరేగిపోయింది, అంతకంటే కష్టమా..? అని ఒకరు ప్రశ్నిస్తే, చీర‌ల్లో ఆఫీసుకి వెళ్లి  ఇస్రో సైంటిస్టులు మార్స్ మిష‌న్ పూర్తి చేశారు. టాలెంట్‌, ప‌నిత‌నం ముఖ్యం. చీర అంటే అందమైన తెలివి అని అభివర్ణించారు. ఇంకొందరు ఇది హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. మొన్న దీపావళి టపాసులు, ఇవాళ చీర, ఇక రేపు అగరుబత్తీలను కూడా టార్గెట్ చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ  వీడియోను మెచ్చుకున్న వారి కంటే తిట్టిన వారే ఎక్కువ. అయితే ఛానెల్ నిర్వాహకులు మాత్రం నెటిజన్ల విమర్శలతో తలబొప్పికట్టి నోరు మెదపడం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top