జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి.. వై.ఎస్. జగన్‌ విడుదలపై ప్రసారం | National, international Media telecasting of curiosity on ys jagan release | Sakshi
Sakshi News home page

జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి

Sep 25 2013 2:00 AM | Updated on Jul 28 2018 6:26 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన దృశ్యాలను రాష్ట్రంలోని తెలుగు వార్తా చానళ్లతోపాటు జాతీయ వార్తా చానళ్లు కూడా విస్తృతంగా ప్రసారం చేశాయి.

జగన్ బయటకు వచ్చిన దృశ్యాలను విస్తృతంగా ప్రసారం చేసిన చానళ్లు
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన దృశ్యాలను రాష్ట్రంలోని తెలుగు వార్తా చానళ్లతోపాటు జాతీయ వార్తా చానళ్లు కూడా విస్తృతంగా ప్రసారం చేశాయి. హెడ్‌లైన్స్ టుడే, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, జీ న్యూస్, డీడీ న్యూస్, ఆజ్‌తక్ చానళ్లు ప్రతి 10 నిమిషాలకు ఓసారి జగన్‌మోహన్‌రెడ్డి ర్యాలీగా ఇంటికి చేరే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించాయి. దీనికి రిపోర్టర్ల వ్యాఖ్యానాలను కూడా జత చేశాయి. హెడ్‌లైన్స్ టుడే అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు...జగన్‌మోహన్‌రెడ్డి బయటకొచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకులతో అరగంటపాటు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.
 
  పలు మరాఠీ, కన్నడ వార్తాచానళ్లు కూడా జగన్ ర్యాలీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్, ఫస్ట్ పోస్ట్ వంటి జాతీయ ఆంగ్ల దినపత్రికలు, ద వీక్ వంటి వారపత్రికలు సైతం తమ వెబ్‌సైట్లలో జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రస్తావించాయి. ‘జగన్‌మోహన్‌రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ 16 మంత్స్...’, ‘జగన్ రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ టు రైజింగ్ రిసెప్షన్...’ అంటూ శీర్షికలు పెట్టాయి. ఆయా వెబ్‌సైట్లలో ఈ వార్తను చదివిన నెటిజన్లు దీనిపై హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను పొందుపరచడం కూడా కనిపించింది. కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని జగన్ విడుదల కావడం సంతోషంగా ఉందంటూ ఎక్కువ మంది నెటిజన్లు పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ సైతం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల వార్తను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
 
 ద లయన్ ఈజ్ బ్యాక్: జగన్ బెయిల్‌పై విడుదలైన వెంటనే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వేలకొద్దీ పోస్టులు, ట్వీట్లు దర్శనమిచ్చాయి. జగన్ ర్యాలీ దృశ్యాల షేరింగులు, లైకులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించాయి. ‘హీ ఈజ్ ద రూలర్...’, ‘ద లయన్ ఈజ్ బ్యాక్...’, ‘ద కింగ్ ఆఫ్ ఆంధ్ర వైఎస్ జగన్ ఈజ్ బ్యాక్...’, ‘జగన్ బెయిల్‌పై విడుదలైన కొద్దిసేపటికే ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పాలకులకు వెన్నులో వణుకు మొదలవుతుందనేందుకు ఇది సంకేతం’, ‘మైకేల్ జాక్సన్ తర్వాత ఈ రోజు జగన్‌ను చూసేందుకు వెల్లువలా వచ్చిన ప్రజాభిమానాన్ని చూశా...’, ‘భారీ జనసందోహం...ఎప్పుడూ అంత మం దిని చూడలేదు..’, ‘ఇక రాజకీయాలన్నీ మారిపోతాయి..’, ‘రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కా రం దొరికినట్లే..’ వంటి ట్వీట్లు, పోస్టులతో నెటిజన్లు, అభిమానులు హోరెత్తించారు. ‘కింగ్ ఈజ్ కింగ్.. ఎవర్ అండ్ ఎవర్’, ‘ఓన్లీ ఒన్’, ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’ వంటి పోస్టులు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమయ్యాయి.
 
 వీటికి క్షణాల్లో లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్‌లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫేస్‌బుక్‌లో ఏ పేజీ క్లిక్‌చేసినా జనంలోకి జగన్ వచ్చాడనే వార్తే హైలెట్ అయ్యింది. ఉదయం నుంచే ‘ఈ రోజు అన్న బయటకు వస్తాడు’ అంటూ మొదలైన హడావుడి సాయంత్రమయ్యే సరికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రికి లోటస్‌పాండ్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అభిమానులు వీటికి లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్ చేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ‘ఫేస్‌బుక్‌లో మేము ఈరోజు షేర్ చేసుకున్న స్వీటెస్ట్ న్యూస్ ఇదే’ అని ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ‘కంగ్రాట్స్ జగన్ సర్’ అని శుభాభినందనలను పంచుకున్న వారెందరో. ఓ నెటిజెన్ అయితే జగన్ అదృష్ట సంఖ్యను ఏడుగా లెక్కగట్టాడు. జగన్ జైలులో గడిపిన 484 రోజులను 4+8+4=16 అని, 16 నెలలు అంటే 1+6=7 అని, జగన్  దాఖలు చేసుకున్న ఏడో బెయిల్ పిటిషన్‌కే వచ్చిందని గుర్తుచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement