కోట రహస్యం..వీడని చిక్కుముడి

Murder Case NoT Solved  - Sakshi

గజపతి రాజా సిబ్బంది ఆత్మహత్యల కేసులో..వెల్లడికాని వాస్తవాలు

పర్లాకిమిడి : గజపతి సంస్థానం మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థత కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆయన వ్యక్తిగత సిబ్బంది కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవి జిల్లా వ్యాప్తంగా బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజావారి ఆరోగ్యం పట్ల ఆయన వ్యక్తిగత సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగానే రాజావారు నిశ్చలస్థితిలో ఉండిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సిబ్బందిపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు.

ఈ అవమానం భరించలేక రెండేళ్ల క్రితం రాజావారి వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన గజపతి సంస్థానం మేనేజర్‌ అనంగమంజరీ దేవి, ఆమె సోదరి విజయలక్ష్మి పాత్రో, తమ్ముళ్ళు సంజయ్‌కుమార్‌ పాత్రో, సంతోష్‌కుమార్‌ పాత్రోలు వారి స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థకు గురై ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆధీనంలో దీర్ఘకాలిక వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గజపతి ప్యాలెస్‌ వ్యవహారాలు మహారాజా గోపినాథ గజపతి నారాయణ దేవ్‌ కుమార్తె కల్యాణీ దేవి చూసుకుంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యంలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. 

సిట్‌కు కేసు అప్పగింత

కానీ కారణాలు ఎంతమాత్రం తెలియరాకపోవడంతో సిట్‌ బృందానికి కేసును అప్పగించారు. ఈ బలవన్మరణాల పట్లబలమైన వ్యక్తుల పాత్రే ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పలు మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అనంతరం దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యల రహస్యాన్ని పసిగట్టేందుకు అప్పట్లో సిట్‌ బృందం రెండు నెలల కాలం పాటు పర్లాకిమిడిలో ఉండి దర్యాప్తు చేపట్టింది. ఇదే సమయంలో సంస్థానం మేనేజర్‌ అనంగమంజరీ దేవి మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులను కూడా ప్రశ్నించింది. 

కేసుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందిని సిట్‌ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మేనేజర్‌ మరణ వాంగ్మూలంలో ఏముందోనన్న విషయం ఇప్పటికీ సిట్‌ దర్యాప్తు బృందం వెల్లడించకపోవడంపై కూడా స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

నివేదిక సంగతేంటి..?

దర్యాప్తు పూర్తయినా ఇంతవరకు నిందితుల వివరాలు కూడా వెల్లడించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సిట్‌ దర్యాప్తు బృందం అలసత్వంపై బాధిత కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా ఆశ్రయించారు. అయినా వివరాలు తెలియరాక పోవడం విశేషం. అప్పట్లో ఈ ఉమ్మడి ఆత్మహత్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కేసు విషయంలో కొందరి రాజకీయ నేతల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు బృందం నివేదిక వెల్లడిస్తుందా? లేదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాల మేరకు సిట్‌ నివేదిక వెల్లడిస్తుందని అధికారులు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top