అచ్చం సినిమాలాగే.. బుక్కైన తండ్రి!

Man Fakes Poverty For Son Admission Arrested - Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ : అచ్చం ‘హిందీ మీడియం’ సినిమా తరహాలోనే ఓ వ్యక్తి తన కొడుకుకు ప్రముఖ పాఠశాలలో అడ్మిషన్‌ పొందేందుకు అక్రమమార్గం తొక్కాడు. తాము సంపన్నులు అయినప్పటికీ.. నిరుపేదగా పేర్కొంటూ నకిలీ పత్రాలు పొంది.. కొడుకును ప్రఖ్యాత విద్యాసంస్థలో చేర్పించాడు. తాజాగా నకిలీ ధ్రువపత్రాల రాకెట్‌ పట్టుబడటంతో అతని బాగోతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన గౌరవ్‌ గోయల్‌ తన కుమారుడిని న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదివించాలని ఆశపడ్డాడు. నకలీ సర్టిఫికేట్స్‌ సృష్టించి ఆర్థికంగా వెనుకబడినవర్గం కింద 2013 సంవత్సరంలో ఆ పాఠశాలలో కొడుకును చేర్పించాడు. తాజాగా అతని గుట్టురట్టు కావడంతో జైలుపాలైయ్యాడు. శనివారం అతనితోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఢిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ మాధుర్‌ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, కొడుకుని ఉన్నత పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ్‌ గోయల్‌ నకిలీ ఇన్‌కం సర్టిఫికేట్‌ సంపాదించాడు. దీనితోపాటు అడ్మిషన్‌కు కావల్సిన ఇతర పత్రాలను కూడా నకిలీవి సృష్టించాడు. 2015లోనే ఉన్నత విద్యాసంస్థల్లో నకిలీ పత్రాల రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి నీరజ్‌ కుమార్‌  వద్ద నుంచి గౌరవ్‌ ఈ నకిలీ పత్రాలు పొందాడు. సర్టిఫికేట్‌ బ్రోకర్‌ అయిన నీరజ్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో గౌరవ్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కో నకిలీ పత్రాన్ని సృష్టించేందుకు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నీరజ్‌ ఒప్పుకున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top