
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఎనిమిదో రోజు కూడా బుట్టదాఖలయ్యాయి. బుధవారం వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనలు కొనసాగించాయి. అవిశ్వాస తీర్మానం నోటీసులు తనకు అందాయని, చర్చను కూడా చేపడతానని స్పీకర్ చెప్పారు. కానీ సభ ఆర్డర్‌లో ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తానని స్పష్టం చేశారు.
‘‘అవిశ్వాస తీర్మానంపై తప్పకుండా చర్చిద్దాం. విపక్షాలు, అధికారపక్షం ఇద్దరూ ఇందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సభ సజావుగా జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. దయచేసి సభ్యులు సహకరించండి..’ అని స్పీకర్ చెప్పారు. కానీ తమిళ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్.. లోక్‌సభను సోమవారానికి(ఏప్రిల్ 2కు) వాయిదావేశారు.