
విమానాల రాకపోకలు బంద్..
కొచ్చి : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొచ్చి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. వరద నీటిని తరలించేందుకు ఇదమలయార్, చెరుతోని డ్యామ్ గేట్లను ఎత్తివేసిన అనంతరం పెరియార్ నదీ తీరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేశారు.
ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడంతో ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్‌ను మధ్యాహ్నం వరకూ నిలిపివేశామని విమానాశ్రయ ప్రతనిధి వెల్లడించారు. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, వరద ముప్పుతో వేలాది మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఇడుక్కి, కొజికోడ్, కన్నూర్, వయనాద్, తిరువనంతపురం సహా పలు జిల్లాల్లో వరద పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.