‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’

Kathua Rape Victim Mother Sabeena I am Afraid To Fetch Water From The Stream - Sakshi

కశ్మీర్‌ : సబీనా, యాకూబ్‌ దంపతులు ఓ నెల రోజుల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించారు. కార్గిల్‌ శిఖరాల అంచుల నుంచి సాంబ మైదానాలకు చేరుకున్నారు. చివరకు తమ స్వగ్రామం రసనాకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఆగిపోయారు. తమ స్వగ్రామానికి వెళ్లాలని వారు ఎదురుచూస్తున్నారు. రసన.. ఆ పేరు తలచుకుంటేనే వారికి భయంతోపాటు బాధ కూడా తన్నుకోస్తుంది. అ‍క్కడే తమ ఏనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా ఆడిపాడింది. పశువుల వెంట, గొర్రెపిల్లల వెనక పరుగు తీసింది. కానీ ఆకస్మాత్తుగా ఆ అందమైన దృశ్యాల స్థానే ఓ భయంకరమైన సంఘటన వచ్చి చేరింది.

ఆసిఫా ఎనిమిదేళ్ల చిన్నారి.. ప్రపంచం అంటే ఏంటో తెలియని పసిపాప.. లోకమంతా తనలానే ఉంటుందని నమ్మిన అమాయకురాలి మీద కొన్ని మృగాళ్లు దాడి చేశాయి. తనకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిట్టితల్లి మూడు రోజుల పాటు దేవాలయంలోనే దయ్యాలకు ఆహారమయ్యింది. జరుగుతున్న ఘోరాన్ని చూడలేక ఆ దేవత నిజంగానే శిలయ్యింది. మూడురోజుల పాటు దైవసాక్షిగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. ఈ సంఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా కావాల్సినంతా టీఆర్‌పీ సాధించింది. ప్రతిపక్షాలు అధికారి పార్టీ మీద తనివి తీరా దుమ్మెత్తి పోశాయి. మేం సిగ్గుపడుతున్నాం అంటూ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో రెండు కన్నీటి బొట్లు రాల్చారు. 

చిత్రమేంటంటే అన్యాయం జరిగిన కుటుంబాన్నే సమాజం శిక్ష విధించింది. పోయిన ప్రాణం.. పడిన వేదన గ్రామస్తులకు కనిపించలేదు. మా వాళ్లనే జైలుకు పంపిస్తారా మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులు. ఆఖరికి తమ స్థలంలోనే బిడ్డను ఖననం చేసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్‌ గ్రామానికి తరలించి అక్కడ ఖననం చేశారు. చేతుల్లో ఉన్న భారాన్ని భూమాతకు అప్పగించారు. తిరిగి సొంత గ్రామానికి వెళ్లలేక ఎక్కడో సాంబ మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.

ఈ దారుణం జరిగి ఇప్పటికి 10నెలలు గడిచాయి. క్రమంగా ఆ సంఘటన ప్రజల మనసుల నుంచి చెరిగిపోయింది. ఆదుకుంటామన్న ప్రభుత్వాలు ఆ మాటే మర్చిపోయాయి. తల్లి ఆ శోకం నుంచి ఇంకా కోలుకోలేదు.. తండ్రి కూతుర్ని కలవరిస్తున్నాడు. సమాజం ఇప్పడు కూడా వారిని వదలడం లేదు. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ బెదిరింపులు. ఒంటరిగా సమీప నదికి వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాలన్నా వెళ్లలేని పరిస్థితులు. వీటన్నింటి కంటే ఎక్కువగా ఆ తల్లిదండ్రులను భయపెడుతున్నది తాము చనిపోయేలోపైనా తమ కూతురికి న్యాయం జరుగుతుందా.. చివర వరకూ పోరాడే శక్తి తమకు ఉందా అనే విషయం గురించే.

ఎందుకంటే ప్రస్తుతం హాసీన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశం.. ఈ కేసు విచారణ జరుగుతున్న పఠాన్‌కోట్‌ కోర్టుకు దాదాపు 530 కిలోమీటర్ల దూరాన ఉంది. కోర్టు ట్రయల్స్‌కి హాజరు కావడానికి డబ్బు లేదు. సంపాదించే పరిస్థితులు కూడా లేవు. చేసేదేం లేక ఉన్న గొర్రెలను.. పశువులను అమ్ముకుంటున్నారు. తమ ఆస్తి అంతా అమ్మకున్నా పర్వాలేదు. కానీ తమ కూతురికి న్యాయం జరిగితే చాలు అంటున్నారు. అదేంటి ప్రభుత్వం సాయం అందలేదా అంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చోలేము. నా చిట్టితల్లి కోసం మేమే పోరాడతాం. ఆ మృగాళ్లకు శిక్ష పడితేనే నా కుమార్తె ఆత్మ శాంతిస్తుందంటున్నారు కథువా బాధితురాలి తల్లిదండ్రులు యాకూబ్‌, సబీనా.

కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఆసిఫా అనే బాలికను ఆరుగురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా డ్రగ్స్‌ ఇచ్చి కొన్ని రోజుల పాటు లైగింక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. ఆసిఫా ఒక గిరిజన ముస్లిం తెగకు చెందిన బాలిక. హిందువులు అధికంగా ఉండే కథువా ప్రాంతంలో కొంతమంది దుండగులు బాలికను కిడ్నాప్‌ చేసి ‘దేవిస్థాన్‌’ అనే దేవాలయంలో ఉంచి అత్యాచారం చేసి, అంతమొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసిఫా తల్లిదండ్రుల దుర్భర జీవితం గడుపుతూ కూడా కూతురికి న్యాయం జరిగేలా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top