ఒక్క అబ‌ద్ధం ఢిల్లీ హింస‌కు కార‌ణ‌మైంది

Kapil Mishra's Men Attack Anti CAA Podium Rumours Led To Delhi Riots - Sakshi

అల్ల‌ర్ల‌ను ప్రేరేపించేందుకే వ‌దంతుల వ్యాప్తి

న్యూఢిల్లీ: బీజేపీ నాయ‌కుడు క‌పిల్ మిశ్రా మ‌ద్ద‌తుదారులు పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ) వ్య‌తిరేక నిర‌స‌న వేదిక‌కు నిప్పంటించార‌నే పుకారే ఢిల్లీలో పెద్ద ఎత్తున హింస‌కు దారి తీసింద‌ని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కాగా క‌పిల్ మిశ్రా త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి మౌజ్‌పూర్‌లో ఫిబ్ర‌వ‌రి 23న సీఏఏ అనుకూల‌ ర్యాలీ తీశారు. అయితే వీరు జ‌ఫ‌రాబాద్‌లో సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న వేదిక‌కు నిప్పంటించార‌నే వ‌దంతులు వ్యాపించ‌డంతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌కారులు రోడ్ల మీద‌కు వ‌చ్చి విధ్వంసం సృష్టించారు. దీంతో సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ప్రారంభ‌మైన‌ ఘ‌ర్ష‌ణ‌లు హింసాత్మ‌కంగా మారడంతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించాయి. ఈ క్ర‌మంలో డ‌య‌ల్పూర్‌లో ఆందోళ‌న‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ హెడ్ కానిస్టేబుల్ ర‌త‌న్ లాల్‌పై దుండ‌గులు మూక దాడి చేసి అత‌డిని దారుణంగా హ‌త్య చేశారని ఛార్జిషీటులో ప్ర‌స్తావించారు. (భావజాలం రగిలించిన ఘర్షణలు)

అయితే ఉద్దేశ‌పూర్వ‌కంగా అల్ల‌ర్ల‌ను ప్రేరేపించ‌డానికే ఈ వ‌దంతులు వ్యాపించాయ‌ని పోలీసులు తెలిపారు. మ‌రోవైపు స్వ‌రాజ్ ఇండియా చీఫ్‌, సామాజిక ఉద్య‌మ కారుడు యోగేంద్ర యాద‌వ్ పేరును ఛార్జిషీట్‌లో ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ నిందితుడిగా పేర్కొన‌లేదు. అయితే అత‌ను ఛాంద్ బాగ్‌లో విద్వేష‌పూరిత ప్ర‌సంగం చేశార‌ని పేర్కొన్నారు. ఇక‌ సీఏఏ వ్య‌తిరేక నిర‌స‌న‌కారుల‌పై బీజేపీ నేత క‌పిల్ మిశ్రా చేసిన విద్వేష ప్ర‌సంగ‌మే ఢిల్లీలో అల్ల‌ర్ల‌కు నాంది అయింద‌ని అంత‌ర్జాతీయ మీడియా సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజుల పాటు కొన‌సాగిన‌ ఢిల్లీ అల్ల‌ర్ల‌లో సుమారు 50 మంది మ‌ర‌ణించారు. (ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top