18 ఏళ్లుగా ఆ రోడ్డు నిర్మాణం సా..గుతోంది!! | Sakshi
Sakshi News home page

13.7 కిలోమీటర్ల రహదారి నిర్మాణం 18 ఏళ్లుగా..

Published Sun, Jun 17 2018 6:37 PM

Kalindi Kunj Bypass Road Project Works Pending For 18 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని రాజకీయ పార్టీలపై విమర్శలు రావడం మామూలే. అయితే 18 ఏళ్ల క్రితం మంజూరైన ఓ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. వివరాలు.. ఢిల్లీ, నొయిడా, ఫరిదాబాద్‌ను కలుపుతూ సాగే కాళింద్‌ కుంజ్‌ బైపాస్‌ ప్రాజెక్టు 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రాజెక్టుతో పాటు అదే ఏడాదిలో ఢిల్లీ మెట్రోకు కూడా కాంగ్రెస్‌ పాలకులు శంకుస్థాపన చేశారు. అయితే 277 కిలోమీటర్ల రైల్వే లైన్‌తో మెట్రో నిర్మాణం పూర్తి చేసుకోగా, 13.7 కిలోమీటర్ల కాళింద్‌ కుంజ్‌ బైపాస్‌ ప్రాజెక్టు మాత్రం అటకెక్కింది. ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించాడానికి 18 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుని మంజూరు చేయగా, అంతకంతకూ పెరిగిన వాహనాల రద్దీలో దక్షిణ ఢిల్లీ ఊపిరి సలపకుండా ఉంది.

అన్నీ ఆటంకాలే..!
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ను వివరణ కోరగా.. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల కారణంగా నిర్మాణం ఆగిపోయిందని తెలిపింది. ఓక్లా పరిరక్షణ కేంద్రం(బర్డ్‌ శాంక్చూరీ) మీదుగా రోడ్డు వేయాల్సి రావడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయని పేర్కొంది. అయితే రీడిజైన్‌ అనంతరం మట్టి తవ్వకాలు, కొలతలు చేపట్టామని వివరించింది. కానీ, రోడ్డు నిర్మాణానికి అవరసమైన 43 ఎకరాలకు యూపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున 2007లో మరోమారు పనులు నిలిచిపోయాయని తెలిపింది. కాగా, భూ అనుమతుల విషయమై 2017లో ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది.

Advertisement
Advertisement