తక్షణ న్యాయం ఉండదు!

Justice loses character if it becomes revenge says CJI SA Bobde - Sakshi

ప్రతీకారం కాస్తా న్యాయంగా మారకూడదు

విచారణ జాప్యాలపై సమీక్ష జరగాలి

స్వీయ దిద్దుబాటుకు తగిన ఏర్పాట్లు ఉండాలి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యలు

జోధ్‌పూర్‌: న్యాయమన్నది ఎప్పుడూ తక్షణం అందేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బాబ్డే స్పష్టం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని ఆయన తెలిపారు. రాజస్తాన్‌ హైకోర్టులో శనివారం ఒక కొత్త భవనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దిశ హత్య కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన నేపథ్యంలో ప్రాధాన్యమేర్పడింది. ఇటీవలి పరిణామాలు చాలా పురాతనమైన చర్చను సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాయన్న జస్టిస్‌ బాబ్డే న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.  

ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉండాలని, ఇందుకోసం కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు ఉన్నవాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివాదాలను వేగంగా సంతృప్తికరంగా పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదే సమయంలో న్యాయవ్యవస్థ పట్ల మారుతున్న దృక్పథంపై కూడా అవగాహన ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పిదాలను స్వయంగా దిద్దుకునే ఏర్పాటు అవసరముందని, అయితే ఈ ఏర్పాట్లను ప్రచారం చేయాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమని అన్నారు.

గత ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చేసిన వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాలను స్వయంగా సరిచేసుకునేందుకు జరిగిన ఒక ప్రయత్నమేనని అన్నారు. ‘లిటిగేషన్లను వేగంగా పరిష్కరించే పద్ధతులను ఏర్పాటు చేయడమే కాదు. లిటిగేషన్లను ముందస్తుగా నివారించాల్సి ఉంది’అని చెప్పారు. కేసు దాఖలయ్యే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇప్పటికే కొన్ని చట్టాలున్నాయని, వాటిని అన్ని కేసులకూ తప్పనిసరి చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు.  

అంతకుముందు కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్‌ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు. విచారణ జాప్యం దేశంలోని మహిళలను తీవ్రమైన బాధకు, ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో హేయమైన నేరాల విచారణకు 704 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉన్నాయని, పోక్సో, మానభంగ నేరాల విచారణకు మరో 1,123 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ తరువాత మానభంగ కేసుల నిందితులకు సత్వర శిక్ష పడేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో దిశ నిందితులు మరణించడంపై కొన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేయడం, సంబరాలు చేసుకోవడం కొందరి ఆందోళనకు కారణమవుతోంది.

పేదలకు అందని స్థాయిలో న్యాయ ప్రక్రియ: రాష్ట్రపతి
దేశంలో న్యాయ ప్రక్రియ పేదలకు అందని స్థాయిలో ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్‌పూర్‌లో శనివారం హైకోర్టు కొత్త భవనం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజుల్లో పేదవారెవరైనా ఇక్కడకు ఫిర్యాదు తీసుకుని రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది.

ఎందుకంటే రాజ్యాంగం పీఠికలో అందరికీ న్యాయం అందించడం బాధ్యతని మనమందరం అంగీకరించాం కాబట్టి’ అని అన్నారు. న్యాయం కోసం పెడుతున్న ఖర్చుపై గాంధీజీ ఆందోళన వ్యక్తం చేశారని, దరిద్ర నారాయణుల సేవే ఆయనకు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అన్నారు. గాంధీజీ ప్రాథమ్యాలను గుర్తు చేసుకుంటే, కటిక పేదవాడు, అతి బలహీనుడి ముఖాలను మనం మననం చేసుకుంటే ఈ అంశాల్లో మనకు తగిన మార్గం కనిపిస్తుందని అన్న రాష్ట్రపతి న్యాయ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత న్యాయసేవలు ఒక మార్గం కావచ్చునని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top