ఇక మా టార్గెట్‌ గగన్‌యాన్‌: శివన్‌

ISRO Next Priority Is Gaganyaan Says ISRO Chief Sivan - Sakshi

భువనేశ్వర్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. చంద్రయాన్‌-2 ప్రయోగం 98శాతం విజయం సాధించిందన్న ఇస్రో  ఛైర్మన్‌ శివన్‌.. ఇక తమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌ అని ప్రకటించారు. శనివారం ఆయన ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఇక విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కోసం తాము ఎంతో శ్రమించామని కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. చం‍ద్రుడి దక్షిణధ్రువంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయిన విషయం తెలిసిందే. దీని నుంచి వెంటనే తేరుకున్న ఇస్రో ఇకతమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్‌ అని స్పష్టం చేసింది.

కాగా సాయుధ బలగాల్లోని టెస్ట్‌ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.

విక్రమ్‌ ల్యాండర్‌ అసాధ్యమేనా..
ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ గల్లం‍తైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది.

చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మళ్లీ విక్రమ్‌ ల్యాండర్‌ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్‌ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top