సరిహ‌ద్దులో భార‌త బ‌ల‌గాల నిర్బంధం

Indian Jawans Detained By China In Ladakh - Sakshi

న్యూఢిల్లీ: భార‌త్ చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద కొంత‌కాలంగా ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ల‌డ‌ఖ్‌లో స‌రిహ‌ద్దు వ‌ద్ద గ‌స్తీ కాస్తున్న భార‌త జ‌వాన్ల‌ను చైనా ఆర్మీ ద‌ళాలు నిర్బంధించి విడుద‌ల చేసినట్లు స‌మాచారం. ప్యాంగ్యాంగ్ వ‌ద్ద చోటు చేసుకుంటున్న ఘ‌ర్ష‌ణ‌లు మొద‌లుకొని  స‌రిహ‌ద్దు వ‌ద్ద తలెత్తిన ప‌రిస్థితుల గురించి ఆర్మీ అధికారులు స‌వివ‌రంగా ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేశారు. దీని ప్ర‌కారం.. ఆర్మీ అధికారులు ప్ర‌ధానమంత్రి ఆఫీసుకు వివ‌రించారు. గ‌త బుధ‌వారం తూర్పు లఢక్‌లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా ద‌ళాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగగా పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ స‌మ‌యంలో చైనా.. భార‌త జ‌వాన్ల‌ను వారి ఆయుధాల‌తో స‌హా లాక్కుని నిర్బంధించింది. అనంత‌రం వారిని వ‌దిలేసింది. విష‌యం తెలుసుకున్న‌ ఇరు దేశాల ఆర్మీ క‌మాండ‌ర్లు స‌రిహ‌ద్దు వ‌ద్ద స‌మావేశ‌మ‌వ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. (‘చైనా హెలికాప్టర్‌ చొరబాటుకు యత్నించింది’)

ఆ త‌ర్వాత కూడా స‌రిహ‌ద్దు వ‌ద్ద‌ గ‌గ‌న‌త‌లంలో చైనా హెలికాప్ట‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. మ‌రోవైపు చైనా ద‌ళాలు భార‌త భూభాగంలోకి చొచ్చుకు వచ్చి తూర్పు ల‌డ‌ఖ్‌లోని మూడు ప్రాంతాలైన ప్యాంగాంగ్‌, డెమ్‌చోక్‌, గ‌ల్వాన్‌లో పెద్ద సంఖ్య‌లో కోట‌లు, బోట్లు, గుడారాలు ఏర్పాటు చేశాయి. అయితే ప్ర‌స్తుతం వాటిని చైనా తొల‌గించింది. ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అటు చైనాతోపాటు ఇటు భార‌త్ కూడా స‌రిహ‌ద్దులో అద‌న‌పు బ‌లాల‌ను మెహ‌రించింది. ఇదిలా వుండ‌గా వాస్త‌వాధీణ రేఖ వెంబ‌డి గ‌స్తీ కాస్తున్న భార‌త ద‌ళాల పెట్రోలింగ్‌కు చైనా ఆటంకం క‌లిగించింది. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన భార‌త ప్ర‌భుత్వం వాస్త‌వాధీణ రేఖ‌కు లోపలే ఆర్మీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంద‌ని తెలిపింది. కాగా గ‌ల్వాన్‌లో భార‌త్ చేప‌ట్టిన ర‌హ‌దారి నిర్మాణంపై చైనా అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతోంద‌ని అధికారులు భావిస్తున్నారు. కాగా ప‌రిస్థితులును ప‌ర్య‌వేక్షించేందుకు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎమ్ ఎమ్ న‌ర‌వ‌నె శుక్ర‌వారం లేహ్‌ను సంద‌ర్శించారు. (భార‌త్‌ పహారాకు చైనా ఆటంకం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top