ప్రతీకారానికి సిద్ధమే | Indian Air Force Ready For Revenge Says Air Chief Marshal BS Dhanoa | Sakshi
Sakshi News home page

ప్రతీకారానికి సిద్ధమే

Feb 17 2019 4:17 AM | Updated on Feb 17 2019 4:18 AM

Indian Air Force Ready For Revenge Says Air Chief Marshal BS Dhanoa - Sakshi

పోఖ్రాన్‌: ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఉగ్ర ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని వైమానిక దళం చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా ప్రకటించారు. పాకిస్తాన్, పుల్వామా దాడి గురించి నేరుగా మాట్లాడకుండా ఆయన ఇస్లామాబాద్‌ ప్రేరణతో పెచ్చరిల్లుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో శనివారం ‘వాయుశక్తి ఎక్సర్‌సైజ్‌’పేరిట ఒకరోజు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధనోవా మాట్లాడుతూ ‘తన మిషన్లను సాకారం చేసుకోవడంలో వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుంది. జాతీయ భద్రత, సార్వభౌమ పరిరక్షణలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు వైమానిక దళానికి ఉన్నాయని హామీ ఇస్తున్నా. 

యుద్ధాలు అరుదుగానే జరుగుతాయి. సంప్రదాయ యుద్ధంలో మనల్ని ఓడించలేమని శత్రువుకు తెలుసు. కాబట్టి మనకు ఊహించని, కొత్త రకపు ముప్పు ఎప్పుడూ ఉంటుంది. శత్రు భూభాగాల్లో మన సైనికుల్ని జారవిడవడం, విడిపించటం, ముష్కరులను శిక్షించడం కోసం ఈరోజు మన శక్తి, సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్నాం’ అని ధనోవా అన్నారు. పాకిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పుల్వామా దాడి చోటుచేసుకున్న రెండు రోజుల తరువాత జరగడం గమనార్హం. వాయుశక్తి ఎక్సర్‌సైజ్‌కు ప్రణాళికలను ఇంతకుముందే రూపొందించామని, పుల్వామా దాడితో సంబంధంలేదని వైమానిక దళ వర్గాలు తెలిపాయి.

అబ్బురపరచిన విన్యాసాలు.. 
ఉదయం నుంచి చీకటి పడే వరకు వైమానిక దళ విన్యాసాల ప్రదర్శన కొనసాగింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లతో పాటు మొత్తం 140 యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణి ప్రతిభాపాటవాల్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు తమ ముందు నిర్దేశించిన లక్ష్యాల్ని కచ్చితత్వంతో ఢీకొట్టాయి. మిలిటరీ కసరత్తులో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్, ఆకాశ్‌ క్షిపణిని మోహరించడం ఇదే తొలిసారి. 

అప్‌గ్రేడ్‌ చేసిన మిగ్‌–29 అనే యుద్ధ విమానాన్ని కూడా ఈసారి పరీక్షించారు. సుకోయ్‌–30, మిరేజ్‌–2000, జాగ్వార్, మిగ్‌–21 బైసన్, మిగ్‌–27, మిగ్‌–29, హెర్క్యూల్స్, ఏఎన్‌–32 విమానం తదితరాలు కూడా ఈ విన్యాసాల్లో కనువిందు చేశాయి. ముఖ్యంగా చీకటి పడిన తరువాత అంతిమ ఘట్టంలో ఏఎన్‌–32, సీ–132జె హర్క్యూల్స్‌ విమానాలు ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళ గౌరవ గ్రూప్‌ కెప్టెన్, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement