ఇక మాటల్లేవ్‌.. యుద్ధమే : గంభీర్‌

Gautam Gambhir Says Enough is Enough on Pulwama Terror Attack - Sakshi

ఉగ్రదాడిని ఖండించిన క్రికెటర్లు

న్యూఢిల్లీ : ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్‌.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్‌ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. (చదవండి: ఉగ్ర మారణహోమం)

అయితే ఈ దాడిని యావత్‌ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సురేశ్‌ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్‌ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: వైరల్‌ వీడియో : ‘అక్కడ శవాలు పడున్నాయి’)

భారత క్రికెటర్ల ట్వీట్స్‌.. 
ఇక జరిగింది చాలు. వెంటనే వేర్పాటువాదులు, పాకిస్తాన్‌తో మాట్లాడనివ్వండి. కానీ ఈ సంభాషణ అనేది గదుల్లో కా​​‍కుండా.. యుద్ధ మైదానంలో ఉండాలి.
- గౌతం గంభీర్‌

పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి జరగడం, వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇదో విచారకరమైన వార్త. ఈ దాడిలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
- వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఈ ఉగ్రదాడి వార్త తీవ్రంగా కలచి వేసింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
- శిఖర్‌ ధావన్‌

జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి జరగడం.. అనేక మంది జవాన్లు ప్రాణాలుకోల్పోవడం వినడానికి చాలా బాధగా ఉంది. ఈ దాడిచేసిన పిరికి పందలకు త్వరలోనే గుణపాఠం కలగాలని ప్రార్థిస్తున్నాను.
- మహ్మద్‌ కైఫ్‌

ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు నా ఆలోచన, ప్రార్థన అంతా వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల గురించే.
-సురేశ్‌ రైనా

సీఆర్పీఎఫ్‌ జవాన్లపై పిరికిపందలు జరిపిన దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందడం బాధను కలిగిస్తోంది. ఈ బాధను వర్ణించడానికి పదాలు రావడం లేదు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి.
- వీరేంద్ర సెహ్వాగ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top