
‘బట్టలు ఉతికే నేను జాదవ్ వల్లే నేడిలా..’
మరణ శిక్షకు గురైన కులభూషణ్ జాదవ్‌ను వెంటనే పాకిస్థాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మానవహారం నిర్వహించారు.
ముంబయి: మరణ శిక్షకు గురైన కులభూషణ్ జాదవ్‌ను వెంటనే పాకిస్థాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మానవహారం నిర్వహించారు. పాక్ చర్యను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా గతంలో బట్టలు ఉతుకుతూ అనంతరం జాదవ్ ద్వారా తన జీవితాన్నే మార్చుకున్న యువకుడు ఈ కార్యక్రమ నిర్వాహక బాధ్యతలు తీసుకున్నాడు. గతంలో తనకు జాదవ్ ఎంతో సహాయం చేశారని, చదువులో అండగా ఉండటమే కాకుండా తన ఆకలి బాధను తీర్చారని, అలాంటి వ్యక్తిని పాక్ ఎలా ఉరితీస్తుందని ప్రశ్నిస్తూ విజయ్ కనువాజియా అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
‘జాదవ్‌గారు నాకు ఎంతో సహాయం చేశారు. చదువులో ఆదుకున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకున్నారు. రాత్రి 11గంటల వరకు నాకోసం భోజనం చేయకుండా జాదవ్‌గారి కుటుంబం ఎదురుచూసేది. పాకిస్థాన్ వెంటనే జాదవ్‌ను విడుదల చేయాలి. ఆయన గుఢాచారి కాదు’ అని విజయ్ కనువాజియా అనే యువకుడు తెలిపాడు. గతంలో బట్టలు ఉతికే పనిలో ఈ బాలుడు ప్రస్తుతం ఆ పని మానేసి డిగ్రీ పూర్తి చేశాడు. సైన్యంలోకి అడుగుపెట్టడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు.