ఆకాశ వీధిలో అద్భుత రెస్టారెంట్‌!

Fly Dining Restaurant In Manyata Tech Park Bangalore - Sakshi

బెంగళూరు: ఆకాశంలో.. అల్లంత ఎత్తులో గాల్లో వేలాడుతూ విందు ఆరగిస్తే.. భలే థ్రిల్‌గా ఉంటుంది కదూ. ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్‌’ ఎక్స్‌పీయరెన్స్‌ కోసం బెంగళూరు వెళ్లాల్సిందే. దేశంలో తొలిసారి ప్రారంభించిన ఈ ‘ఫ్లై డైనింగ్‌’ మాన్యతా టెక్‌ పార్క్‌లోని నాగవర లేక్‌ ఒడ్డున ఉంది. గాల్లో వేలాడే ఈ రెస్టారెంట్‌ ఎత్తు 160 అడుగులు. బెంగళూరుకు చెందిన జంపింగ్‌ ఇండియా అనే అడ్వేంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ ఈ రెస్టారెంట్‌ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో నేహా గుప్తా మట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్ల నుంచి ఈ ఫ్లై డైనింగ్‌ ప్రారంభించాలని చూస్తున్నాం. ఈ మేరకు మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించాం. గత వారమే దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామ’’ని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 ఫ్లై డైనింగ్‌లు ఉండగా, ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్‌ రెస్టారెంట్‌ ఇదే. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్‌ టేబుల్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌ను క్రేన్‌ ద్వారా పైకి లేపుతారు. ఇందులో ఒక ఫొటోగ్రాఫర్, నలుగురు రెస్టారెంట్‌ సిబ్బంది ఉంటారు. ఎత్తు నుంచి పడిపోకుండా మూడు సీట్‌ బెల్టులు ఉంటా యి. ఈ రెస్టారెంట్‌లోకి గర్భవతులు, 14 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి ఉండదు. కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువు పట్టింపులు లేవు. వర్షం కురిసినా తడవకుండా డెక్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, తీవ్రమైన గాలులు వీచినప్పుడు మాత్రం ఈ రెస్టారెంట్‌ను కిందికి దించుతారు. మరింకెందుకు ఆలస్యం? బెంగళూరు వెళ్తే.. తప్పకుండా ‘ఫ్లై డైనింగ్‌’ ఎక్స్‌పీయరెన్స్‌ పొందండి. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top