ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది.
ప్రభుత్వ భవనాల్లో అక్రమ నివాసులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ప్రభుత్వ భవనాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. అయితే, ఈ బిల్లులోని నిబంధనలను సాకుగా తీసుకుని పార్లమెంటు సభ్యులను ప్రభుత్వం వేధించే అవకాశం ఉందని పలువురు సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ భవనాల్లో అక్రమం నివాసం సమస్యపై గ ట్టి చర్యలు తీసుకునేందుకు త్వరలోనే నగరాల మేయర్ల సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఈ బిల్లు కాంగ్రెస్ తెచ్చినదే అయినప్పటికీ రాజకీయ వివేచనతోనే సభలో ప్రవేశపెడుతున్నట్టు ఆయన చెప్పారు. చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత రాయ్, వెంకయ్యకు మధ్య లోక్‌సభలో సంవాదం చోటుచేసుకుంది. ఎంపీలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఔచిత్యంలేదని, రాయ్ వ్యాఖ్యానించగా, ఈ అంశంపై నిబంధనలను అనుసరించక తప్పదని మంత్రి అన్నారు. తమకు ఎవరిపైనా కక్షలేదని, మంత్రులకు అధికారిక నివాసం కల్పించేందుకు అక్రమ నివాసులను ప్రభుత్వ భవనాలనుంచి ఖాళీచేయించవలసి వస్తోందని, బాధాకరమే అయినా, ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. కాగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్మెన్నార్‌ఈజీఏ) అమలులో ప్రభుత్వం తీరును ప్రతిపక్ష సభ్యులు పలువురు సోమవారం లోక్‌సభలో విమర్శించారు.