‘ఈరోజు విజయం సాధించాం’

Father Of Nirbhaya Says Today Is Our Victory - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిర్భయ తండ్రి బద్రినాథ్‌ సింగ్‌ దోషులకు ఉరిశిక్ష అమలైన అనంతరం విజయ చిహ్నం చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈరోజు మేం విజయం సాధించాం..సమాజం, మీడియా, ఢిల్లీ పోలీసుల వల్లే ఇది సాధ్యమైంది..నేను ఎంత సంతోషంతో ఉన్నాననేది నా నవ్వు మీకు చెబుతుంద’ని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను శుక్రవారం తెల్లవారుజామున జిల్లా మేజిస్ర్టేట్‌, అధికారుల సమక్షంలో ఉరి తీశారు.

ఏడేళ్ల తర్వాత న్యాయం
ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిన ఈ రోజు చారిత్రక దినమని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ అన్నారు. ఈ రోజు ఆమె ఆత్మకు శాంతి కలిగిందని, మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఇది గట్టి సందేశమని, మీరు ఈ తరహా నేరాలకు పాల్పడితే మీకు ఉరిశిక్ష పడుతుందనే హెచ్చరికను పంపిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఎప్పుడో జరగాల్సింది..
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. దోషులను ఉరితీయడంతో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమనే గట్టి సందేశాన్ని పంపారని అన్నారు. నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదని ప్రజలు తెలుసుకుంటారని, శిక్ష అమలును వాయిదా వేసుకోగలరేమో కానీ, శిక్ష నుంచి తప్పించుకోలేరని వెల్లడైందని అన్నారు.

చదవండి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top