మూడుసార్లు నేర చిట్టా ప్రచురణ

EC advertisement format for candidates to declare criminal records - Sakshi

పోలింగ్‌లోగా పత్రికలు, టీవీల్లో డిక్లరేషన్‌ ఇవ్వాలి

అభ్యర్థులు, పార్టీలు వేర్వేరుగా ప్రకటించాలి: ఈసీ ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తమ నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని మీడియాలో మూడు రోజులు ప్రకటనల రూపంలో వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌ ప్రహారీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ప్రజాప్రయోజన ఫౌండేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా న్యాయ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఎన్నికల అఫిడవిట్‌ ఫారం–26ను సవరించినట్లు తెలిపింది. దీని ప్రకారం క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు, గతంలో శిక్షకు గురైన అభ్యర్థులు ఆయా కేసుల వివరాలను మీడియా ద్వారా డిక్లరేషన్‌ ఇవ్వాలి.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్‌ తేదీకి ముందు రెండు రోజుల వరకు మూడుసార్లు పత్రికల్లో, న్యూస్‌ చానెళ్లలో ఈ డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఉదాహరణకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు నవంబరు 22, పోలింగ్‌ తేదీ డిసెంబరు 7. కాబట్టి, డిక్లరేషన్‌ ప్రచురణ నవంబరు 23 నుంచి డిసెంబరు 5 మధ్య మూడు వేర్వేరు రోజుల్లో ఉండాలి. పత్రికల్లో అయితే ఫాంట్‌ సైజ్‌ 12గా ఉండాలి. నియోజకవర్గ పరిధిలో విస్తృత సర్క్యులేషన్‌ కలిగి ఉన్న పత్రికల్లో ఈ ప్రకటన జారీచేయాలి. టీవీల్లో అయితే పోలింగ్‌ ముగి సే సమయానికి 48 గంటల ముందు వరకు మూడుసార్లు వేర్వేరు తేదీల్లో డిక్లరేషన్‌ ప్రసా రం కావాలి. డిక్లరేషన్‌ క్లిప్పింగ్‌లను జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల వ్యయ ఖాతాలతోపాటు సమర్పించాలి. తమ నేర చరిత్రను సొంత పార్టీకి వెల్లడించినట్లు అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించే ఫారం–26లోని నిబంధన 6(ఎ)లో పేర్కొనాలి.  

రాజకీయ పార్టీలు కూడా..
తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు కలిగి ఉన్నట్లయితే పత్రికలు, టీవీ చానెళ్లలో పార్టీలు డిక్లరేషన్‌ ఇవ్వాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు మూడుసార్లు పత్రికలు, న్యూస్‌ ఛానెళ్లలో ఈ వివరాలను వెల్లడించాలి. ఈ క్లిప్పింగ్‌లను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించాలి. అప్పటివరకు ప్రభుత్వ వసతి పొంది, బకాయిలు చెల్లించకుండా ఉంటే ఆ సమాచారాన్ని అభ్యర్థులు ఫారం–26లో వెల్లడించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top