Sakshi News home page

చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్‌

Published Sun, Feb 19 2017 2:11 AM

చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్‌

సాక్షి, చెన్నై: ‘‘శాసనసభలో బల పరీక్షలో గెలుపుతో అమ్మ జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మ శశికళ చేసిన వీర శపథం నేరవేర్చాం’’ అని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి  పళనిస్వామితో కలిసి మెరీనా బీచ్‌ తీరంలో ఉన్న జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పన్నీర్‌ సెల్వం చేత చిన్నమ్మ ఎందుకు రాజీనామా చేయించారన్న ప్రశ్నకు అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాలే సమాధానమని పేర్కొన్నారు.

ప్రతిపక్ష డీఎంకేతో కలిసి అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పన్నీర్‌సెల్వం కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పన్నీర్‌కు డీఎంకేతో రహస్య సంబంధాలున్నాయన్న విషయాన్ని గుర్తించి పదవి నుంచి తప్పించారేగానీ, చిన్నమ్మ సీఎం కావాలన్న ఆశతో మాత్రం కాదన్నారు. పార్టీ వర్గాల ఒత్తిడి, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకే ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలంతా ఐక్యతతో ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తామని, అమ్మ చూపిన మార్గంలో సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని దినకరన్‌ వెల్లడించారు. బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా శశికళ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.

Advertisement

What’s your opinion

Advertisement