కుక్కను నరికి.. బీజేపీ అధ్యక్షుడికి డెత్‌ వార్నింగ్‌

Death warning to Tapir Gao by miscreants in ARUNACHAL PRADESH - Sakshi

ఇటానగర్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ తాపిర్‌ గావ్‌కు దుండగులు డెత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తాపిర్‌ గావ్ ఇంటి ఎదుట తమవెంట తీసుకొచ్చిన ఓ కారుకు నిప్పంటించి, అనంతరం శునకాన్ని అతికిరాతకంగా కత్తితో నరికి చంపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని గిరిజన తెగల సంప్రదాయాల ప్రకారం శత్రువును చంపేస్తామని బెదిరించడానికి, శునకాన్ని బలి ఇవ్వడం వారి ఆచారం. ప్రస్తుతం తాపిర్‌ గావ్‌ ఢిల్లీలో ఉన్నారు. ఈ ఘటనపై తాపిర్‌ గావ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'ఓ దుండగుడు కారును మా ఇంటి ముందుకు తీసుకొచ్చి తగలబెట్టాడు. అనంతరం ఓ కుక్కను చంపాడు. నన్ను, నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలా చేసుంటారు' అని తాపిర్‌ పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితున్ని గుర్తించామని, అతన్ని అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక బృందాలను పంపామని అరుణాచల్‌ ప్రదేశ్‌ డీజీపీ ఎస్‌బీకే సింగ్‌ తెలిపారు. తాపిర్‌ ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు.

లోక్‌ సభ ఎన్నికల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి తాపిర్‌ గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని తాపీర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 41 స్థానాలు గెలుపొంది అధికారాన్ని చేపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ పదో ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత పెమాఖండూ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top