మాజీ సీఎం ఓటు వేస్తుండగా చూశారని...
సీపీఎం నాయకుడు, కేరళ మాజీ మంత్రి జి. సుధాకరన్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.
అలపుజ: సీపీఎం నాయకుడు, కేరళ మాజీ మంత్రి జి. సుధాకరన్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ ను ఓటు వేస్తుండగా చూసినందుకు ఆయనపై ఎన్నికల ఫిర్యాదు అందింది. కేరళలో సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్యుతానందన్ అలపుజ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనకు ఎవరకి ఓటు వేస్తున్నారో తెలుసుకునేందుకు పోలింగ్ కేబిన్ లోని వెళ్లి సుధాకరన్ తొంగి చూశారని అలపుజ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఏ షకుర్ ఆరోపించారు.
సీనియర్ నాయకుడైన సుధాకరన్ ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి ఇలా చేయడం పట్ల ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. రెండుసార్లు ఆయనీ విధంగా చేశారని చెప్పారు. అచ్యుతానందన్, ఆయన భార్య ఓటు వేస్తుండగా ఆయన తొంగి చూశారని అన్నారు. అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని సుధాకరన్ అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి జర్నలిస్టులను ఎందుకు పోలీసులు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలపై న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు.


