రికార్డు స్థాయిలో మరణాలు

COVID-19: India records 31787 confirmed corona cases - Sakshi

ఒక్క రోజులో 71 మరణాలు 

కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు  

మొత్తం మరణాలు 1,008

న్యూఢిల్లీ: దేశంలో కరోన రక్కసి జనం ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కరోనా సంబంధిత మరణాలు వెయ్యి మార్కును దాటేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 71 మంది కన్నుమూశారు.  కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,008కు, మొత్తం పాజిటివ్‌ కేసులు 31,787కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్‌ కరోనా కేసులు 22,982 కాగా, 7,796 మంది బాధితుల కోలుకున్నారు. అంటే మొత్తం బాధితుల్లో 24.52 శాతం మంది ఆరోగ్యవంతులైనట్లు స్పష్టమవుతోంది.

కేవలం 0.33% మంది వెంటిలేటర్లపై
దేశంలో మొత్తం కరోనా వైరస్‌ బాధితుల్లో కేవలం 0.33 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ చెప్పారు. 1.5 శాతం మంది ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నారని, 2.34 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు.  హర్షవర్దన్‌ బుధవారం లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో సరిపడా ఐసోలేషన్‌ పడకలు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

దేశంలో ప్రస్తుతం 288 ప్రభుత్వ ల్యాబ్‌లు 97 ప్రైవేట్‌ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 16,000 కరోనా నమూనా సేకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. నిత్యం 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్‌ కెపాసిటీని పెంచుతామన్నారు. అందుబాటులో ఉన్న సోషల్‌ వ్యాక్సిన్లు లాక్‌డౌన్, భౌతిక దూరం అని స్పష్టం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని హర్షవర్దన్‌ కొనియాడారు.  

129కి తగ్గిన హాట్‌స్పాట్‌ జిల్లాలు
దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ జిల్లాలు గత 15రోజుల్లో 170 నుంచి 129కి తగ్గాయి. అలాగే కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రీన్‌జోన్లు 307 నుంచి 325కు పెరిగాయి. నాన్‌–హాట్‌స్పాట్‌ జిల్లాలు(ఆరెంజ్‌ జోన్లు) 207 నుంచి 297కు చేరాయి. ఏప్రిల్‌ 15వ తేదీన కేంద్ర ప్రభు త్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని 170 జిల్లాలను కరోనా వైరస్‌ హాట్‌స్పాట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి లాక్‌డౌన్‌ కంటే ముందు 3 నుంచి 3.25 రోజులు పట్టగా, ప్రస్తుతం 10.2 నుంచి 10.9 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top