ఎక్కువ ఫీజులు, ఆన్‌లైన్‌ చదువులు.. నో జాబ్స్‌!

Covid 19 Derails Plans Of Indian Students - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవచ్చని. అక్కడ చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయన్నది వారందరి ఆశ. కోవిడ్‌–19 వైరస్‌ విజృంభన వల్ల వారంతా ఇప్పుడేమయ్యారు? ఎలా చదువుకుంటున్నారు ?ఫీజుల కింద లక్షలాది రూపాయలు చెల్లించిన వారంతా ఇప్పుడు కళాశాలలకు వెళ్ల కుండా ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నారు. ఇళ్లలో కూర్చొని చదవుకోవడం అంటే తమను అవమానిస్తున్నట్లుగా ఉందని వారిలో ఎక్కువ మంది వాపోతున్నారు. 2019 సవంత్సరంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వారికి అది సాధ్యపడలేదు. గత ఏడాది అక్కడికి వెళ్లిన వారు ఇళ్లకు పరిమితమై ఆన్‌లైన్‌లో చదవుకుంటున్నా ఫీజులు తగ్గించక పోవడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఈ పాపులర్‌ యాప్స్‌ అన్నీ చైనావే)

‘నేను 2019, ఆగస్టు నెలలో అమెరికాలోని  కాలిఫోర్నియాకు ఉన్నత చదవు కోసం వెళ్లాను. అప్పుడంతా సవ్యంగానే ఉంది. 2020, జనవరి నెలలో నా రెండవ సెమిస్టర్‌ పూర్తయింది. ఆ వెంటనే ఉద్యోగం వచ్చింది, మార్చి నెలలో యూనివర్శిటీ మూత పడింది. దాంతో ఆన్‌లైన్‌ చదవులు మొదలయ్యాయి. అంతలోనే కరోనా కారణంగా నా ఉద్యోగం కూడా ఊడింది. దాంతో శాన్‌ఫ్రాన్సిస్కోలోని నా సోదరుడి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆశ్రయం తీసుకున్నాను. అయినప్పటికీ కాలిఫోర్నియాలో నేను రెంట్‌కు తీసుకున్న ఇంటికి అద్దె చెల్లించాల్సి వస్తోంది’ అంటూ  రితికా అనే ఎంఎస్‌ విద్యార్థిని వాపోయారు. 

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ చేయడానికి రోష్నీ నెడుంగడి అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో అడ్మిషన్‌ రావడంతో భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడానికి ముందే అక్కడికి వెళ్లారు. అడ్మిషన్‌ తీసుకున్న కొంత కాలానికే క్యాంపస్‌ను మూసివేసి ఆన్‌లైన్‌ చదవులు చేపట్టారని ఆమె చెప్పారు. ‘ఆన్‌లైన్‌లో చదువు కోవడానికి అమెరికా దాకా రావాలా? భారత్‌లోనే ఉండి చదవుకోవచ్చుగదా?’ అని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. కొన్ని  రోజులు ఆన్‌లైన్‌ ద్వారా, మరికొన్ని రోజులు కాలేజీ క్యాంపస్‌కు రావడం ద్వారా పాఠాలు చెబుతామని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారని ఆమె చెప్పారు. అయితే ఆ విషయంలో వారిని తాను నమ్మలేక పోతున్నానని, దానికి సంబంధించి వారివద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే కారణమని ఆమె వాపోయారు. వారిద్దరిదే కాదు, అలా వెళ్లిన విద్యార్థులంతా ఇలాగే ఆందోళన చెందుతున్నారు. (72 గంటల్లోనే గల్వాన్‌‌ నదిపై బ్రిడ్జి నిర్మాణం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top