సీజేఐ అభిశంసన; సుప్రీంకోర్టులో హైడ్రామా

Congress Withdraws Petition On Impeachment Of CJI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాపై అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్‌ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్‌ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి.

అసలేం జరిగింది?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు(ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, అమీ హర్షద్రాయ్‌ యాజ్ఞిక్‌లు) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏకే గోయల్‌ల ధర్మాసనం.. రెండో నంబర్‌ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్‌ ప్రకటించారు. కానీ..

రాత్రికి రాత్రే మార్పులు: కాగా, సోమవారం నాటి రిజిస్ట్రార్‌ ప్రకటనకు విరుద్ధంగా.. మంగళవారం ఉదయం 6వ నంబర్‌ కోర్టులో, వేరొక ధర్మాసనం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పిటిషన్‌పై విచారణను ప్రారంభించారు. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కపిల్‌ సిబాల్‌, ప్రశాంత్‌ భూషణ్‌లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలను సిబల్‌ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్‌.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్‌ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ‘మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌’ సీజేఐనే కాబట్టి ఏ నిమిషంలోనైనా ధర్మాసనాలను మార్చే అధికారం చీఫ్‌ జస్టిస్‌కు ఉంటుందని తెలిసిందే.

ఆశ్యర్యంగా ఉంది: ‘‘రాత్రికి రాత్రే ధర్మాసనాన్ని మార్చే అధికారం సీజేఐకి ఉంది. అయితే, సంబంధిత ఆదేశాల కాపీని ఇవ్వబోమని చెప్పడం మాత్రం ఆశ్యర్యం కలిగించింది. ‘ఆర్డర్‌ కాపీ లేకుండా, దాన్ని చదవకుండా మేం చాలెంజ్‌కు ఎలా వెళ్లగలం? అని సిబర్‌ అడిగారు. అప్పుడు కోర్టు.. ‘మెరిట్స్‌ ఆధారంగా ముందుకు వెళ్లండి’ అని సూచించింది. విచారణపై నమ్మకం సడలిన పరిస్థితిలో సిబాల్‌ కాంగ్రెస్‌ ఎంపీల పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు’’ అని ప్రశాంత్‌ భూషణ్‌ మీడియాకు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top