గుజరాత్‌లో కాంగ్రెస్‌ కొత్త వ్యూహం

Congress eyes anti-BJP front in Gujarat - Sakshi

బీజేపీ వ్యతిరేక పక్షాలతో కూటమి

హార్ధిక్‌ పటేల్‌, మేవాని, ఠాకూర్‌లకు ఆహ్వానం

ఇతర పార్టీలను పిలిచిన కాంగ్రెస్‌

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వివిధ ఉద్యమాల రూపంలో చుక్కలు చూపించిన హార్థిక్‌ పటేల్‌, జిగ్నేష్‌ మేవాని, అల్పేష్‌ ఠాకూర్‌లను కలుపునే ప్రయత్నాలను కాంగ్రెస్‌ మొదలు పెట్టింది. పటేల్‌, ఠాకూర్‌, మేవార్‌లు వారి సామాజిక వర్గాల కోసం గుజరాత్‌లో భీకరమైన ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో వీరిని కలుపుకుని గుజరాత్‌ ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

చేతులు కలుపుదాం
హార్థిక్‌ పటేల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. టిక్కెట్‌ ఇచ్చేందుకు తాము సిద్ధమని, అందులో సందేహం లేదని గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ భరత్‌ సిన్హా సోలంకి చెప్పారు. అదే విధంగా దళితుల కోసం ఉద్యమాలు చేసిన జిగ్నేష్‌ మేవాని, అవినీతి, మద్యంపై పోరాటాలు చేసిన ఠాకూర్‌లు కాంగ్రెస్‌తో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. పటేల్‌ సామాజిక​వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటే హార్థిక్‌ పటేల్‌ చేసిన ఉద్యమం.. గుజరాత్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 
బీజేపీకి వ్యతిరేకులకు ఆహ్వానం
గుజరాత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సోలంకి... రాష్ట్రంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలబడదామని చెప్పారు. అందులో భాగంగా రాజ్యసభ ఎన్నికల్లో సహకరించిన జేడీయూ, ఎన్‌సీపీ, ఆప్‌ పార్టీ నేతలను ఆయన ఆహ్వానించారు.

ఆలోచించాలి..!
కాంగ్రెస్‌ ఆహ్వానంపై హార్థిక్‌ పటల్‌, ఠాకూర్‌, మేవానిలు భిన్నంగా స్పందించారు. తనకు ఎన్నికల్లో పోటీచేయడంపై ఆసక్తి లేదని హార్థిక్‌ పటేల్‌ తెలిపారు. అయితే తన సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే వరకూ పోరాటం చేస్తానని చెప్పారు. దళిత నేత మేవాని మాత్రం.. తన వర్గీయులతో చర్చించి నిర్ణయం చెబుతానని తెలిపారు.

విమర్శలు - ప్రతివిమర్శలు
రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న హార్థిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌ అని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. తాను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకినని.. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి దూరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మేవాని బీజేపీని విమర్శించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top