తొలి బడ్జెట్‌లోనే పెట్రోల్‌పై పన్ను భారం..

CM HD Kumaraswamy Hikes Rate Of Tax On Petrol And Diesel - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖనూ పర్యవేక్షిస్తున్న కుమారస్వామి మిగులు బడ్జెట్‌ను సాధించడమే తన లక్ష్యంగా స్పష్టం చేశారు. తొలి బడ్జెట్‌లోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను భారాలను మోపారు. పెట్రోల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నును 30 నుంచి 32 శాతానికి, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 1.14, డీజిల్‌ రూ 1.12 మేర పెరగుతాయని చెప్పారు.

ఇక తొలి విడతగా 2017 డిసెంబర్‌ 31 వరకూ ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. సకాలంలో రుణాలను చెల్లించిన రైతులకు ప్రోత్సాహకరంగా బకాయిలు లేని రైతులకు రూ 25,000 నగదు లేదా వారు చెల్లించిన రుణంలో ఏది తక్కువైతే దాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.

వ్యవసాయ రుణాల మాఫీతో రైతులకు రూ 34,000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని కుమారస్వామి చెప్పారు. రైతులకు తాజా రుణాలు లభించేలా బకాయిలు రద్దయినట్టు బ్యాంకుల నుంచి రైతులకు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తామని వెల్లడించారు. దీనికోసం 2018-19 బడ్జెట్‌లో రూ 6,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top