చంద్రయాన్‌–2 కక్ష్య దూరం పెంపు | Chandrayaan-2 orbit distance was increased | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌–2 కక్ష్య దూరం పెంపు

Aug 3 2019 2:25 AM | Updated on Aug 3 2019 2:25 AM

Chandrayaan-2 orbit distance was increased - Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ కేంద్రం నుంచి గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్‌–2 మిషన్‌కు సంబంధించి శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్‌లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్‌–2 మిషన్‌ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు.

బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌–2 మిషన్‌లోని ఆర్బిటర్‌లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్‌–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24న మొదటి విడతలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్లకు, 26న రెండోసారి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని 54,829 కిలోమీటర్లకు, 29న చేపట్టిన ఆపరేషన్‌లో మూడోసారి భూమికి దగ్గర్లో ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని 270 కిలోమీటర్లకు, దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,792 కిలోమీటర్లకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచిన విషయం తెలిసిందే.

తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత 14న చివరిగా చంద్రయాన్‌–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement