
బుల్లి తెరపై కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. 25 ఏళ్లుగా సోనీ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న ఈ క్విజ్ షోకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు వరకు ఈ షోలో పాల్గొనేందుకు అమితాసక్తి చూపిస్తుంటారు. ఇప్పటివరకు ఇందులో పాల్గొన్న చాలా మంది భారీగా నగదు గెలుచుకున్నారు.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన మహిళా సైంటిస్ట్ ఒకరు రూ.12.5 లక్షలు గెలిచి సత్తా చాటారు. రూ. 25 లక్షలు గెలిచే అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యారు. హరిప్రియ సాకేతపురం.. ఇస్రోలో శాస్త్రవేత్తగా (ISRO scientist) పనిచేస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో తాజాగా బిగ్ బి ఎదురుగా హాట్ సీటులో కూర్చునే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ముందుగా ఆమెను అమితాబ్ సాదరంగా ఆహ్వానించి, ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్త తొలిసారిగా కేబీసీకి రావడం తమ అదృష్టమని ఆయన అన్నారు.
ఉద్యోగం, కుటుంబం
ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడిన ఉద్యోగ జీవితం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్‌లతో తన ప్రయాణం గురించి మాట్లాడారు. కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ కెరీర్‌లో ఏవిధంగా ముందుకెళుతున్నారో వివరించారు. తర్వాత గేమ్ మొదలు పెట్టారు. ఒక్కో ప్రశ్నకు సమాధానాలు చెబుతూ 13వ క్వశ్చన్ దగ్గర ఆగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిష్క్రమించడంతో రూ.12.5 లక్షలు గెలిచారు. ఆ ప్రశ్నకు కూడా సమామాధానం చెబితే ఆమెకు పాతిక లక్షలు దక్కేవి. అయితే పోటీ నుంచి తప్పకున్నాక ఆమె గెస్ చేసిన సమాధానం కరెక్ట్ అని తేలడం విశేషం. ఇంతకీ ఏంటా ప్రశ్న?
పరమహంస యోగానంద ఆత్మకథ ప్రకారం.. ఆయన మహాత్మా గాంధీకి ఏ పండును సూచించి, కాలిఫోర్నియా నుంచి వార్ధాకు కొన్ని మొక్కలను పంపారు?
ఎ. కాంటాలౌప్
బి. హకిల్‌బెర్రీ
సి. అవకాడో
డి. పీచ్
సరైన సమాధానం: అవకాడో
ఇంకా ఆడాల్సింది..
షో చూస్తున్న వారంతా హరిప్రియ అనవసరంగా క్విట్ చేసిందని, పోటీలో ముందుకెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేబీసీలో హరిప్రియ రూ. 25 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఆమె ప్రయాణం (Journey) చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు.
చదవండి: కష్టాలనూ ఆడేసుకున్నారు