భారతదేశంలోని అజ్మీర్‌లోని మాయో కళాశాలలో 1920లలో చదివి, 1932 నుంచి 1970 వరకు ఒమన్‌ను పాలించిన సుల్తాన్ ఎవరు?
ఎ. తైమూర్ బిన్ ఫైసల్
బి. హైతం బిన్ తారిక్
సి. సయీద్ బిన్ తైమూర్
డి. తుర్కి బిన్ సయీద్
దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతిలో (Kaun Banega Crorepati) అడిగిన 25 లక్షల రూపాయల ప్రశ్న ఇది. తన ముందు హాట్‌సీట్‌లో కూర్చున్న శివ చోహాన్‌ను ఆయన ఈ ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆయన సమాధానం చెప్పారా, రూ.25 లక్షలు గెలుచుకున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా?
ప్రస్తుతం కేబీసీ 17 సీజన్ (KBC 17) నడుస్తోంది. చాలా మంది ఇందులో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన శివ చోహాన్‌ను షోలో పాల్గొన్నారు. ఏటీఎం అథరైజర్‌గా పనిచేస్తున్న ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఆర్థిక ఇక్కట్లను వివరించారు. చదువుకుంటూనే కూరగాయలు అమ్మానని, ఏటీఎంలో పనిచేశానని చెప్పారు. పుస్తకాలు అమ్మడం తాను చేసిన మొదటి ఉద్యోగమని.. పుస్తకాల కారణంగానే తాను కేబీసీలో కనిపించగలిగానని వెల్లడించారు. ట్యూషన్‌కు డబ్బు లేకపోవడంతో శివ చోహాన్ తనకు ట్యూటర్‌గా మారాడని ఆయన సోదరి చెప్పారు.
కౌన్ బనేగా కరోడ్‌పతిలో గెలిచిన డబ్బులతో ఏంచేస్తారని అమితాబ్ ప్రశ్నించగా.. ''నా తల్లి ఆరోగ్యం కోసం వెచ్చిస్తానని శివ చోహాన్ సమాధానమిచ్చారు. గతంలో ఇంట్లో జరిగిన ఒక విషాదకర ఘటన కారణంగా మా అమ్మకు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అమ్మకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ అప్పట్లో మా వద్ద అంత డబ్బు లేదు. సరైన చికిత్స చేయించకపోవడంతో అమ్మ ఆరోగ్యం క్షీణించింది. గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలయ్యాయి. కేబీసీలో నేను ఎంత ప్రైజ్‌మనీ గెలిచినా అదంతా అమ్మ చికిత్స కోసమే ఖర్చుపెడతాన''ని శివ చెప్పారు.
ఇక గేమ్‌లోని ఎంటరైన శివ చోహాన్ (Shiva Chohan) ఆడియన్స్, లైఫ్‌లైన్ సహాయంతో చివరకు పన్నెండున్నర లక్షల రూపాయలు గెల్చుకున్నాడు. మరో ప్రశ్నకు సమాధానం చెప్పివుంటే అతడు 25 లక్షల రూపాయలు గెలిచేవాడు కానీ, సమాధానం తెలియకపోవడంతో అక్కడితో నిష్క్రమించాడు. అయితే తర్వాత అతడు చేసిన గెస్ సరైన సమాధానం అని తేలింది. పైన అడిగిన ప్రశ్నకు సమాధానం C అని కరెక్టుగానే ఊహించాడు.
చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!


