జాబిలమ్మ ఒడిలోకి..

Chandrayaan 2 Launch Into ISRO Crown - Sakshi

ఇస్రో కీర్తి కిరీటంలోకి చంద్రయాన్‌–2 ప్రయోగం

55 ఏళ్ల అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయసోపానాలు

షార్‌నుంచి 74 ప్రయోగాలు 105 స్వదేశీ , 297 విదేశీ ఉపగ్రహాలు

ఎన్నో సవాళ్లు..మరెన్నో మైలు రాళ్లు దాటుకుని అద్భుత ప్రయోగాలు విజయవంతం చేసి మరో కీర్తి పతాకాన్ని తన సొంతం చేసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అడుగులు ముందుకువేస్తోంది. జాబిలమ్మపై వింతలూ..విశేషాలపై పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్‌–1ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌–2ను విజయవంతం చేసి ప్రపంచ పటంలో భారత్‌ కీర్తి పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం అవుతోంది. షార్‌ వేదికగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసి అంతరిక్షంలో అద్భుతం సృష్టించి అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. 

విదేశాల నుంచి 30 ఉపగ్రహాలు 
1975 నుంచి 2018 డిసెంబర్‌ వరకు వంద ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి ఇస్రో సెంచరీని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మరో ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి సెంచరీని అధిగమించారు. ఇప్పటి వరకు పంపిన 105 ఉపగ్రహాల్లో 30 ఉపగ్రహాలను రష్యా అంతరిక్ష సంస్థ, ఫ్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రాల నుంచి పంపించారు. విదేశీ వేదికల నుంచి ఇన్‌శాట్‌ సిరీస్, జీశాట్‌ సిరీస్, రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను పంపించారు. ఇప్పటి వరకు 34 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు, 33 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు, 14 ఎక్స్‌పర్‌మెంటల్‌ ఉపగ్రహాలు, 9 నావిగేషన్‌ వ్యవస్థ ఉపగ్రహాలు, 9 మెట్రోలాజికల్‌ ఉపగ్రహాలు, 2 గ్రహాంతర ఉపగ్రహాలు, ఖగోళంలోని స్థితిగతులను పరిశోధించేందుకు 2 స్పేస్‌ సైన్స్‌ ఉపగ్రహాలు, 2 స్టూడెంట్‌ ఉపగ్రహాలను ప్రయోగించారు. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌–1 పేరుతో చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు.

అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్‌యాన్‌–1 పేరుతో అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు. ఈ రెండు ప్రయోగాలు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ప్రపంచ దేశాలను అబ్బురపరిచింది. చంద్రుడు, అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిన అనతి కాలంలోనే చంద్రయాన్‌–2 ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం కావడం విశేషం. చంద్రయాన్‌–2 పేరుతో ఏకంగా చంద్రుడిపై ల్యాండర్‌ దింపి రోవర్‌ ద్వారా చంద్రుడి మూలాలను అన్వేషించేందుకు సమయాత్తమవుతున్నారు. దీనికి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ద్వారా చేస్తున్నారు. ఈ తరహా రాకెట్‌ సిరీస్‌లో ఇది నాలుగో ప్రయోగం కావడం విశేషం. చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం కాగానే గగన్‌యాన్‌ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి విజయాలను నమోదు చేసుకున్నారు. 

సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. సుదీర్ఘమైన అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇస్రో  నేడు చంద్రుడి మీద పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్‌–2 పేరుతో ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్, రోవర్‌లు పంపించే  స్థాయికి ఎదిగింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో కీర్తి కిరీటంలో చంద్రయాన్‌–2 ప్రయోగం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. దేశంలో రాకెట్‌ ప్రయోగాలు ప్రారంభించిన తొలినాళ్లలో 40 కిలోల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ప్రస్తుతం నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్‌–2 వంటి అత్యంత శక్తివంతమైన ప్రయోగం చేసే స్థాయికి చేరింది.

ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో నాలుగో దేశంగా ఆవిర్భవించనుంది.  ఇస్రో ఇప్పటి వరకు 8 రకాల ఉపగ్రహాలను తయారు చేసి వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి ప్రపంచంలో భారత్‌ సత్తాను చాటింది. సముద్రాలు, భూమిని అధ్యయనం చేసేందుకు, భూమి పొరల్లో దాగి ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు, పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితుల అధ్యయనం, ఇంకా రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌)ను ప్రయోగించారు.  రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీఎడ్యుకేషన్, టెలీమెడిసన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌ టెక్నాలజీ వంటి ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు  సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌)ను ప్రయోగించారు. ఇతర గ్రహాల పరిశోధనకు చంద్రయాన్‌–1, మంగళ్‌యాన్‌–1 (అంగారక ప్రయోగం) అనే రెండు గ్రహాంతర ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్‌పర్‌మెంట్‌ ఉపగ్రహాలు, భారతదేశానికి సొంత దిక్సూచి  వ్యవస్థకు నావిగేషన్‌ ఉపగ్రహాలు, ఖగోళాన్ని తెలిజేసేందుకు స్పేస్‌ సైన్స్‌ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్‌ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. ఇలా ఇప్పటి వరకు 105 ఉపగ్రహాలను పంపించి సెంచరీని  అధిగమించారు. ఇప్పటి వరకు షార్‌ నుంచి 74 ప్రయోగాలు చేసి 105 స్వదేశీ ఉపగ్రహాలు, 297 విదేశీ ఉపగ్రహాలు, పది స్టూడెంట్‌ ఉపగ్రహాలు, రెండు రియూజబుల్‌ ప్రయోగాలు చేసి ఇస్రో తన సత్తా చాటుకుంటోంది. ఈ నెల 15న వేకువన 2.51 గంటలకు చంద్రయాన్‌–2 వంటి భారీ ప్రయోగానికి సిద్ధమవుతూ ఇస్రో ఖ్యాతిని ఖండంతరాలకు చాటేందుకు సిద్ధమవుతోంది.                    

ఎస్‌ఎల్‌వీ   నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వరకు అంతరిక్షయానం 
ఇస్రో  ఆవిర్భావంలో రోదసీలోకి ఉపగ్రహాలను పంపేం దుకు ముందుగా సౌండింగ్‌ రాకెట్ల ద్వారా వాతావరణాన్ని అధ్యయనం చేశారు. 1979–80లో శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ) రాకెట్ల ద్వారా 40 కిలోల బరువు కలిగిన చిన్నపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత తక్కువ ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఒక అడుగుకు ముందుకేసి 1992లో ఆగ్‌మెంటెడ్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (ఏఎస్‌ఎల్‌వీ) రాకెట్ల ద్వారా 150 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1994లో పోలార్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ల ద్వారా 1400 కిలోల బరువైన రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ (దూరపరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 508 నుంచి 760 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్య (సన్‌ సింక్రోనస్‌  ఆర్భిట్‌)లోకి ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ఇస్రోకు బహుళ ప్రయోజనకారిగా మారింది. వాణిజ్యపరమైన ఉపగ్రహాలు, రిమోట్‌ సెన్సింగ్, వాతావరణ, సమాచార ఉపగ్రహాలను సైతం పంపించేందుకు పీఎస్‌ఎల్‌వీ ఎంతో దోహదపడింది.  ఆ తరువాత  2 టన్నుల నుంచి 4 టన్నుల వరకు బరువైన సమాచార ఉపగ్రహాల(కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌)ను ప్రయోగించేం దుకు 2001లో జియో శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ), జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్లను రూపొందించారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ప్రయోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాంకేతిక పరమైన పరిణితి సాధించి 2 వేల కిలోల నుంచి 4 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించే స్థాయికి చేరింది. ప్రస్తుతం పంపబోయే చంద్రయాన్‌–2 ఉపగ్రహం బరువు కూడా 3.8 టన్నులు కావడం విశేషం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top