ఎమ్మెల్యేల బేరసారాలపై ఉత్కంఠ

 BJP Says JDS Poaching Its MLAs - Sakshi

సాక్షి, బెంగళూర్‌: కన్నడ సీమలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 13 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతును కూడగడుతూ కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కాగా, ముగ్గురు కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముంబైలో ఓ హోటల్‌లో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని స్వయంగా కర్ణాటక మంత్రి శివకుమార్‌ ఆరోపించారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు సమాచారం ఇచ్చి ముంబై వెళ్లారని, వారితో తాను టచ్‌లో ఉన్నానని సీఎం హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని హోటల్‌లో బీజేపీ నేతల సమక్షంలో ఉన్నారని కర్ణాటక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే బీజేపీ కుట్ర ఫలించదని ఆయన అన్నారు.

రిసార్ట్‌ రాజకీయం..
కర్ణాటకలో రిసార్ట్‌ రాజకీయాలకు మరోసారి తెరలేచింది. బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురైదుగురు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస​ చేసిన వ్యాఖ్యలు కాషాయకూటమిలో కలకలం రేపాయి. మరోవైపు జేడీఎస్‌ సైతం తమ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చూస్తోందని ఆ పార్టీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ తమ శాసనసభ్యులను గురుగావ్‌లోని రిసార్ట్స్‌కు తరలించింది. కాగా కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని ఆ పార్టీ కర్ణాటక చీఫ్‌ దినేష్‌ గుండూరావ్‌ చెప్పారు. ముంబై హోటల్‌లో బస చేసిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీ గూటికి చేరుతారన్నారు.

ఆరోపణలు అవాస్తవం : యడ్యూరప్ప
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాషాయపార్టీ నేత, మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలోని సంకీక్ణ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన తమకు లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురుని ప్రలోభపెట్టేందుకు జేడీఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top