మువ్వన్నెల జెండాతో చిందేసిన ఎంపీ..

BJP MP Jamyang Namgyal Celebrate Ladakh UT Status - Sakshi

లదాఖ్‌ : జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో లదాఖ్‌ ఎంపీ జమ్యంగ్‌ త్సెరింగ్‌ నమగ్యాన్‌ చేసిన ప్రసంగం.. ఆయన్ని ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు బీజేపీ పెద్దలు అభినందించారు. ఈ ఒక్క ప్రసంగంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్యంగ్‌.. తొలిసారిగా ఆదివారం సొంత గడ్డపై అడుగుపెట్టారు. దీంతో లదాఖ్‌ నియోజకవర్గం ప్రజులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లదాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో ఆయన స్థానికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. మువ్వన్నెల జెండా చేత పట్టి చిందులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జమ‍్యంగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కనీసం క్రాకర్స్‌ కూడా కాల్చకుండా ఈ వేడుకలను జరిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. కశ్మీర్‌, లదాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై పార్లమెంట్‌లో ప్రసంగించిన జమ్యంగ్‌.. లదాఖ్‌ ప్రజలు కేంద్రపాలిత ప్రాంతం కోసం 70 ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిపారు. వారి కల ఇప్పటికి నెరవేరిందని పేర్కొన్నారు. అభివృద్ధి నిధులు ఎక్కువగా కశ్మీర్‌కే దక్కాయని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 వల్ల లదాఖ్‌ ప్రజలు నష్టపోయారని చెప్పారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయన చురకలంటించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top