‘ఆ పని కాస్త రహస్యంగా చేయండి’

BJP UP MP Candidate Sanghmitra Maurya Shocking Comments Ahead Polling - Sakshi

లక్నో : ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతీ ఒక్కరూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచరులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య కూడా ఈ కోవలో చేరిపోయారు. యూపీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య కూతురైన సంఘమిత్ర బదౌన్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ ప్రతీచోటా దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది కదా. మీకు కూడా చాన్స్‌ వస్తే అలాగే చేయండి(నవ్వుతూ). పోలింగ్‌ రోజు ప్రతీ ఒక్కరు ఓటు వేయాల్సిందే. ఇక్కడ(బదౌన్‌) కూడా అందరూ ఓటేయాలి. ఒకవేళ ఓటర్లు రాకపోతే మీరే దొంగ ఓట్లు వేసేయండి. కాకపోతే కాస్త రహస్యంగా ఆ పని చేయండి’ అంటూ తన అనుచరవర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో సంఘమిత్ర వ్యాఖ్యల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ జిల్లా మెజిస్ట్రేట్‌ దినేశ్‌ కుమార్‌ను మీడియా ఆశ్రయించింది. ఆమె వ్యాఖ్యల గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా గతంలో కూడా సంఘమిత్ర ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ ఎన్నికల సందర్భంగా ఎవరైనా గూండాయిజం చేయాలని ప్రయత్నిస్తే అస్సలు బాగోదు. ఎందుకంటే అందరికంటే పెద్ద గూండాను నేను ఇక్కడే ఉన్నాను. మీ ఆత్మగౌరవం నిలవాలంటే బదౌన్‌ ప్రజల జోలికి రావొద్దు’ అని ఆమె హెచ్చరించారు. ఇక మంగళవారం జరుగనున్న మూడో దఫా ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌తో సంఘమిత్ర తలపడనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top