
పెద్ద మనసుతో ఆదుకోండి
ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మనసుతో సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
- ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి
- విభజన హామీలకు సంబంధించి మాపై విమర్శలు వస్తున్నాయి
- హామీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయండి.. రాజధానికి భారీగా నిధులివ్వండి..
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మనసుతో సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ఆదివారం సాయంత్రం 6.45కు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తెచ్చారు. ఈ భేటీ సందర్భంగా సీఎం అనేక అభివృద్ధి విషయాలను ప్రధానితో చర్చించారని చంద్రబాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి చాలినంత సాయం చేయాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులను బకాయిలు లేకుండా ఒకే విడతగా విడుదల చేయాలని కోరారు. వెనకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్యాకేజీ మొత్తం చాలా స్వల్పంగా ఉందని, దీనిని మరింతగా పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఈ రైల్వే బడ్జెట్‌లో ఉండేలా చూడాలని కూడా కోరారు.
ఇటీవలే ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీ ప్రకటించామని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు, నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎలాంటి సాయం విడుదల చేయడం లేదు. అందువల్ల కేంద్ర సాధారణ బడ్జెట్‌లో విభజన అంశాలన్నీ ఉండేలా చూడాలని ప్రధానిని కోరారు. లోటు బడ్జెట్‌ను పూడ్చేలా రాష్ట్రం అడిగిన విజ్ఞాపన మేరకు కేంద్ర సాయం లేదని.. దానికి ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తిచేసేలా భారీగా నిధులు కేటాయించాలని కోరారు.
అలాగే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం గతంలో ఖర్చుచేసిన రూ. 5 వేల కోట్లు చెల్లించాలని కోరారు’’ అని బాబు సన్నిహిత వర్గాలు వివరించాయి. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద జరిగిన ఘర్షణపై కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ కనీసం విభజన హామీలను కూడా అమలు చేయించలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయని ప్రధాని వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.