బాటాకు రూ.9 వేల జరిమానా

Bata Fined Rs 9000 For Asking Customer To Pay Rs 3 For Carry Bag - Sakshi

చంఢీగడ్‌: వినియోగదారుడి వద్ద 3 రూపాయల పేపర్‌ బ్యాగ్‌కు చార్జి చేసినందుకు గానూ బాటా ఇండియా కంపెనీకి చండీగఢ్‌ కన్సూమర్‌ ఫోరమ్‌ రూ.9 వేల జరిమానా విధించింది. చంఢీగడ్‌కు చెందిన దినేశ్‌ ప్రసాద్‌ రాతూరి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సెక్టర్‌ 22డీ ప్రాంతంలోని బాటా షోరూంలో ఒక జత బూట్లు కొన్నారు.  దానికి గానూ పేపర్‌ బ్యాగ్‌తో కలిపి బాటా స్టోర్‌, వినియోగదారుడి వద్ద రూ.402 చార్జి చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన బ్యాగ్‌కు ఎందుకు చార్జి చేశారని ప్రసాద్‌ స్టోర్‌ వారిని ప్రశ్నించారు. బాటా స్టోర్‌ నిర్వాహకులు ఇచ్చిన సమాధానంతో దినేష్‌ ప్రసాద్‌ సంతృప్తి చెందలేదు.

దీంతో దినేష్‌ ప్రసాద్‌ కన్స్యూమర్‌ ఫోరం ఆశ్రయించాడు. పేపర్‌ బ్యాగ్‌పై బాటా బ్రాండ్‌ ముద్రించి ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫోరం ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. తనకు రూ.3 రిఫండ్‌ చేయించాలని, అలాగే కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం దాదాపు రెండున్నర నెలల తర్వాత వినియోగదారుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. వినియోగదారుడు చేసిన ఆరోపణలను కౌంటర్‌ ఇచ్చిన బాటా ఇండియా వ్యాఖ్యల్ని త్రోసిపుచ్చింది.  వస్తువులను కొన్న వినియోగదారుడికి ఉచితంగా పేపర్‌ బ్యాగ్‌ అందించాల్సిన బాధ్యత బాటా స్టోర్‌దేనని ఫోరం తెలిపింది.

అలాగే వస్తువులను కొనే వినియోగదారులకు ఉచితంగా బ్యాగ్‌లను అందించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌ బ్యాగ్‌లతో పర్యావరణానికి ఇబ్బంది కలిగితే బాటా ఇండియానే పర్యావరణానికి అనుకూలంగా ఉండే పేపర్‌ బ్యాగ్‌లను వినియోగదారులకు అందించాలని సూచించింది. పేపర్‌ బ్యాగ్‌ ధర రూ.3, లిటిగేషన్‌ చార్జి కింద రూ.1000, అలాగే వినియోగదారుడిని మానసికంగా వేదనకు గురిచేసినందుకు గానూ రూ.3 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్టేట్‌ కన్స్యూమర్‌ డిస్పూట్స్‌ రిడ్రెస్సల్‌ కమిషన్‌ లీగల్‌ ఎయిడ్‌ అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేయాలని ఆదేశించింది. చండీగఢ్ వినియోగదారుల ఫోరమ్ తీసుకున్న నిర్ణయం, పేపర్‌ బ్యాగ్‌లకు చార్జీలు వసూలు చేసే దుకాణదారులకు కనువిప్పులాంటిది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top