మరో ముగ్గురు జవాన్ల వీరమరణం

మరో ముగ్గురు జవాన్ల వీరమరణం


శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్ పట్టణంలో ఉగ్రవాదులతో పోలీసుల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు జరుగుతున్న ఆపరేషన్లో ఆదివారం మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో అమరులైన  జవాన్ల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం అమరులైన వారిలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. 



తెల్లవారుజామున ఈడీఐ భవనంపై పట్టుకోసం ప్రయత్నించిన పారా యూనిట్ కెప్టెన్ పవన్ కుమార్(23), మరో కెప్టెన్ తుషార్ మహాజన్(26), జవాన్ ఓం ప్రకాశ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పవన్ అక్కడే అమరుడవ్వగా.. తీవ్రంగా గాయపడిన తుషార్, ఓం ప్రకాశ్ 92 బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పలు జరపటంతోపాటు.. మధ్యమధ్యలో గ్రనేడ్లు విసురుతున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరలో ఆపరేషన్ ముగిస్తామని తెలిపాయి. శనివారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు మరణించగా.. 9 మంది జవాన్లు గాయపడ్డం తెలిసిందే.



 ఎంతో గర్వంగా ఉంది: పవన్ తండ్రి

 ఈ దాడిలో అమరుడైన తన కుమారుడి త్యాగానికి గర్వంగా ఉందని కెప్టెన్ పవన్ తండ్రి రాజ్‌బీర్ సింగ్ తెలిపారు. ‘నాకు ఒక్కడే కుమారుడు. వాడిరీ దేశం కోసం ఆర్మీకి ఇచ్చేశాను. ఇవాళ దేశ సేవలోనే నా బిడ్డ అమరుడయ్యాడు. ఒక తండ్రిగా ఇంతకన్నా గర్వకారణమేముంటుంది’ అని పేర్కొన్నారు. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన పవన్ మూడున్నరేళ్ల క్రితం ఆర్మీలో చేరినప్పటినుంచి పలు ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్నాడని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

 

 కోటా, స్వాతంత్య్రం కాదు.. దుప్పటి చాలు: కెప్టెన్ పవన్

 ‘కొందరు రిజర్వేషన్లు కోరుతున్నారు, కొందరు స్వాతంత్య్రం కావాలంటున్నారు, నా దుప్పటి తప్ప నాకేమీ వద్దు’... ఇది జమ్మూ కశ్మీర్ పాంపోర్‌లో ఉగ్రవాదులపై పోరులో వీరమరణం పొందిన కెప్టెన్ పవన్‌కుమార్ చివరి సందేశం. తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఈ పోస్ట్ చేశారు.  కొన్ని రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న జేఎన్‌యూ వివాదం, జాట్‌ల ఉద్యమంతో పవన్ జీవితం ముడిపడడం యాదృచ్ఛికమైనా... వాటిపై  అభిప్రాయాలు మాత్రం అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.  జాట్ వర్గానికి చెందిన పవన్ జేఎన్‌యూలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆర్మీ డే రోజున (జనవరి 15) జన్మించిన పవన్‌కు బుల్లెట్ వాహనాలు, కమాండో జీపులంటే ఇష్టం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top