
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం జయలలిత 70వ జయంతి సందర్బంగా పాలక ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత నేత భారీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం దివంగత నేత స్మృతిచిహ్నంగా ‘నమదు పురచ్చి తలైవి అమ్మ’ పత్రికను ప్రారంభించారు.పార్టీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఎంజీఆర్ విగ్రహానికి సమీపంలోనే జయలలిత విగ్రహం అమర్చారు.
నెల్లూరులో రూపుదిద్దుకున్న జయ విగ్రహాన్ని గత ఏడాదే పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించాల్సి ఉండగా, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. గతంలో 1980లో పార్టీ నేత ఎంజీ రామచంద్రన్ మరణానంతరం నమదు ఎంజీఆర్ పేరిట పార్టీ పత్రికను జయలలిత ప్రారంభించారు. ఆ పత్రిక 2016లో జయలలిత మరణించేవరకూ ఏఐఏడీఎంకే అధికార పత్రికగా కొనసాగింది.