సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా  మళ్లీ సురవరం


నారాయణకు ప్రమోషన్

9 మందితో కేంద్ర కార్యదర్శివర్గం

కేంద్ర కమిటీలో చాడ, రామకృష్ణ


 

పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ఐదు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల ఆఖరి రోజైన ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కావడం ఇది రెండో సారి. చాలా కాలం తర్వాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తాకు అప్పగించారు.ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణకు ప్రమోషన్ ఇచ్చి కేంద్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. 125 మందితో జాతీయ సమితిని, 31 మందితో కేంద్ర కమిటీని, 9 మంది చొప్పున కార్యదర్శివర్గాన్ని, కేంద్ర కంట్రోల్ కమిషన్‌ను ఎన్నుకుంది. జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికైన వారిలో ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శితో పాటు డి.రాజా (తమిళనాడు), కె.నారాయణ (ఆంధ్రప్రదేశ్) తదితరులు  ఉన్నారు. శాశ్వత ప్రోగ్రాం కమిషన్ చైర్మన్ హోదాలో పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్ కేంద్ర కార్యదర్శివర్గ భేటీకి హాజరవుతారు. కేంద్ర కమిటీకి ఎన్నికైన తెలుగువారిలో కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఉన్నారు. జాతీయ సమితికి తెలంగాణ నుంచి 9మంది, ఏపీ నుంచి ఆరుగురు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, సిద్ది వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, రామనరసింహారావు, గుండా మల్లేష్ (కంట్రోల్ కమిషన్ సభ్యునిగా), వలి ఉల్లా ఖాద్రీ (ఏఐఎస్‌ఎఫ్ కోటా), ఏపీ నుంచి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, పీజే చంద్రశేఖర్, జల్లి విల్సన్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు (కంట్రోల్ కమిషన్ చైర్మన్) జాతీయ సమితికి ప్రాతినిధ్యం వహిస్తారు. సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి కార్మికరంగం నుంచి జాతీయ సమితి సభ్యులుగా ఉంటారు. ఏపీ తెలంగాణ విభేదాలను విడనాడండి: సురవరం విభజనతో వచ్చిన విభేదాలను విడనాడి సమైక్యత, సమభావంతో తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలు కమ్యూనిస్టుల ఐక్యత, దేశ, రాష్ట్ర రాజకీయాల వరకు అనేక అంశాలపై పార్టీ మహాసభ దిశానిర్దేశం చేసిందని సాక్షి ప్రతినిధికి  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top