
సాక్షి, చెన్నై: బోగస్ ఓటర్లను చేర్చేందుకు ప్రయత్నించే రాజకీయ నాయకులు, అందుకు సహకరించే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆందోళనలతో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న ఆర్కే నగర్‌లో ఇప్పటివరకు 42 వేల బోగస్ ఓటర్లను అధికారులు తొలగించారు.
అయితే ఆర్కే నగర్‌లో ఇంకా 6 వేలమంది బోగస్ ఓటర్లు ఉన్నారనీ..వీరందరినీ తొలగించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించాలంటూ డీఎంకే ఎంపీ ఆర్.ఎస్.భారతీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శివజ్ఞానం, జస్టిస్ రవిచంద్రల ధర్మాసనం ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 48 వేల బోగస్ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దోషులుగా తేలిన రాజకీయ నాయకుల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.