గుజరాత్ ప్రభుత్వం స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
పోలీసు శాఖలో అమలుకు కేంద్ర ప్రభుత్వం సూచన
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వం స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలకు సంబంధించి కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ చర్య తోడ్పడుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
‘మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి అనువైన చర్యలు తీసుకోవాలని నేను ప్రతి ముఖ్యమంత్రికీ లేఖ రాశాను’ అని మేనకా గాంధీ ఆదివారం చెప్పారు. గత నెలలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఆ రాష్ట్రంలోని పోలీసు బలగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచడం ద్వారా బాధితులు వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించవచ్చని, కేసు దర్యాప్తులోనూ వీరు సహాయపడతారని మహిళా, శిశు అభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.