అమ్మో..ఆడపిల్ల

four pairs denies the baby girls - Sakshi

ఆడపిల్ల వద్దన్న నాలుగు జంటలు

అధికారుల కౌన్సిలింగ్‌

చందంపేట మండలంలో ఘటన

ఆడపిల్ల ఉంటే.. ఆ ఇంటికి వెలుగు..
ఈ నినాదం.. ప్రసంగాలకే పరిమితమవుతుందా..
వరుసగా మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే..
ఆమ్మో..ఆడపిల్ల అని బావురుమంటున్నారు..
ఈ ‘బరువు’ మోయలేమని చేతులెత్తేస్తున్నారు..
ఒకవైపు..కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోవైపు అవగాహనలోపం..
కారణం ఏదైనా ఆడపిల్ల అంటే అరిష్టం అనుకుంటున్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన తల్లిదండ్రులు మూడు, నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే తాము సాకలేమని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తున్నారు..ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. చందంపేట మండలంలో నాలుగు జంటలు తమకు పుట్టిన ఆడపిల్లలను సాకలేమంటూ తెగేసి చెప్పారు. వారికి ఐసీడీఎస్‌ అధికారులు, జెడ్పీచైర్మన్‌ స్వయంగా కౌన్సిలింగ్‌ ఇవ్వగా, రెండు జంటలు తమ పిల్లలను తిరిగి తీసుకోగ, మరో రెండు జంటలు ఆరునెలల వరకు సాకి ఆ తర్వాత శిశుగృహకు అప్పగిస్తామని చెప్పారు.  – చందంపేట

చందంపేట (దేవరకొండ) : సృష్టికి మూలం అమ్మ... ఆ తల్లిదండ్రులకు జన్మచ్చింది కూడా ఓ మాతృమూర్తే... అలాంటిది నవమాసాలు మోసి కన్నాక ఆడపిల్ల అని తెలియడంతో సాకలేమని సాకులు చెబుతున్నారు.. నన్ను కన్న నా తల్లి కూడా ఆడదే అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ పాఠశాలల నుంచి పాలు, గుడ్డు, పౌష్టికాహారం కూడా అందిస్తోంది. అదే విధంగా ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడా పథకాలు అమలవుతున్నాయి. అయినా చందంపేట మండల ప్రజల ధో రణిలో మార్పు రావడం లేదు. తాజాగా ఒకే రోజు నలు గురు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను సాకలేమని ఐసీ డీఎస్‌ అధికారులకు అప్పగించేందుకు ముందుకొచ్చారు.

ఆడశిశువులు వద్దనుకున్న ఆ నలుగురు..
నేరెడుగొమ్ము మండలం పీర్లచావిడి గ్రామానికి చెందిన నేనావత్‌ సరస్వతి, లక్ష్మణ్‌ దంపతులకు మొదట మగ సంతానం కలుగగా, 2,3,4వ కాన్పుల్లో ఆడ పిల్లలు జన్మించారు. దీంతో 4వ కాన్పులో జన్మించిన ఆడపిల్లను వదిలించుకునేందుకు ఆ తల్లిదండ్రి సిద్ధమయ్యారు. ఇదే విషయమై ఐసీడీఎస్‌ అధికారులు చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ దృష్టికి విషయాన్ని తీసుకురావడంతో స్పందించిన ఆయన దంపతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకునేలా చూస్తానని హామీనిచ్చారు. దీంతో దంపతులు శిశువును సాధుకుంటామని చెప్పడంతో వారిని ‘మన ఇంటి లక్ష్మి’ కార్యక్రమంలో భాగంగా  జెడ్పీ చైర్మన్‌ సన్మానించారు.

నేరెడుగొమ్ము మండల పరిధిలోని పందిరిగుండుతండాకు చెందిన జ్యోతి, లాలు దంపతులకు 1,2,3 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించడంతో 3వ సంతానాన్ని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. కాగా పీడీ పుష్పలత వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించాలని సూచించారు. అనంతరం ఆడ పిల్లను వదులుకోవాలనుకుంటే ముందుకు రావా లని అన్నారు. అప్పటి దాకా శిశువుకు ఎలాంటి హాని తలపెట్టొద్దని రాతపూర్వకంగా పత్రం తీసుకున్నారు.

చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి పరిధిలోని బాపన్‌మోట్‌తండాకు చెందిన నేనావత్‌ సుశీల, గోపాల్‌ దంపతులకు 1,2 కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 2వ కాన్పులో పుట్టిన ఆడ శిశువును శిశుగృహకు అప్పగిస్తామని అనడంతో ఐసీడీఎస్‌ అధికారులు కౌన్సి లింగ్‌ నిర్వహించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం కల్పిస్తే తమ శిశువును కాపాడుకుంటామని పేర్కొన్నారు. పీడీ పుష్పలత  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయానికి హామీఇవ్వడంతో వారు శిశువును వదులకునే నిర్ణయాన్ని విరమించుకున్నారు.

చందంపేట మండలం యల్మలమంద గ్రామపంచాయతీ బిచ్చితండాకు చెందిన బాణావత్‌ లక్ష్మి, బిచ్చు దంపతులకు వరుసగా మూడు కాన్పుల్లో ఆడ శిశువులు జన్మించారు. దీంతో 3వ కాన్పులో జన్మించిన ఆడ శిశువును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు ఆ పాపకు ఆరు నెలలు తల్లిపాలు అందించాలని సూచించారు. 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top