జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పట్టణంలోని మార్కండేయపురం జగనన్న ఎల్–3 లేఅవుట్ కాలనీలో ర్యాలీ ఆంజనేయకుమార్, భాను శిరీష దంపతులు. వారికి జెస్సీ (2) అనే కుమార్తె ఉంది. శుక్రవారం జెస్సీ తల్లి భాను శిరీష, నాన్నమ్మ వెంకట రమణ పనిమీద పట్టణానికి వచ్చారు.
మధ్యాహ్న కావడంతో జెస్సీ తండ్రి ఆంజనేయకుమార్ అన్నం కలిపి చిన్నారికి తినిపిస్తున్నాడు. ఆ సమయంలో చిన్నారికి అన్నం ముద్ద గొంతు నుంచి దిగక ఉక్కిరిబిక్కిరైంది. దీంతో తండ్రి పక్కనే నివసిస్తున్న వరాల దుర్గను పిలిచాడు. ఆమె వచ్చి చిన్నారికి సపర్యలు చేసింది. అయినా బాలిక స్పృహ కోల్పోయింది.
వెంటనే ఆంజనేయకుమార్ అక్కంపేటలో ఉంటున్న తన అక్క మాటూరి పద్మావతి, బావ రాంబాబులకు ఫోన్ చేశాడు. వారు వచ్చి చిన్నారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


