రాజకీయంగా కలుస్తారా?

Will rajinikanth And Kamal Haasan Be Together In Political Journey - Sakshi

తమిళసినిమా: రాజకీయంగా కమలహాసన్, రజనీకాంత్‌ కలుస్తారా? ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న వాడి వేడి చర్చల్లో ఇది ఒకటి. సినీరంగంలో కమలహాసన్, రజనీకాంత్‌ దిగ్గజాలు. అంతే కాదు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆరంభకాలంలో కమలహాసన్, రజనీకాంత్‌ పలు చిత్రాల్లో కలిసి నటించారు. కాగా చాలా కాలం నుంచి రాజకీయాల్లోకి వస్తానంటూ చెబుతూ వస్తున్న రజనీకాంత్‌ ఇప్పటికీ మాట మార్చలేదు. రాజకీయాల్లోకి వస్తాననే చెబుతున్నారు. అయితే గత ఏడాది మాత్రం బహిరంగరంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అది జరిగి కూడా ఏడాది దాటిపోయింది. అయితే జూన్‌లో రజనీకాంత్‌ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణన్‌ చెబుతున్నారు. ఇక కమలహాసన్‌ విషయానికి వస్తే అనూహ్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి, వెనువెంటనే ఆ దిశగా అడుగులు వేసి మక్కళ్‌ నీది మయ్యం పేరుతో పార్టీని ప్రారంభించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతే కాదు పార్టీ బలోపేతం కాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను పొందారు.

కొన్నిస్థానాల్లో అయితే లక్షకు పైగా ఓట్లను రాబట్టగలిగారు. అదే ఉత్సాహంతో పార్టీని మరింత పటిష్టం చేసి రానున్న శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నటుడు రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించి శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో కమలహాసన్, రజనీకాంత్‌ కలిసి పోటీ చేస్తారా? అలా చేస్తే విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కూడా కమలహాసన్‌తో తనకున్న స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆ రకమైన ప్రసారాలకు నటుడు రజనీకాంత్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అంతే కాదు లోక్‌సభ ఎన్నికల్లో మక్కళ్‌ నీది మయ్యం మంచి ఫలితాలను సాధించిందని కమలహాసన్‌ను అభినందిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో వీరి మైత్రి రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే రాజకీయంగా వీరిద్దరి దృక్పథాలు వేర్వేరన్నది గమనార్హం.

మక్కల్‌ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ తమ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు నటుడు రజనీకాంత్‌కు మధ్య మితృత్వం పటిష్టంగా ఉందన్నారు. అయితే కమలహాసన్, రజనీకాంత్‌ల మధ్య పొత్తు కాలమే నిర్ణయించాలన్నారు. అదేవిధంగా పొత్తు విషయంలో తమ పార్టీ ప్రత్యేకతకు భంగం కలగరాదన్న విషయంలో తాము దృఢంగా ఉన్నామన్నారు. కాబట్టి పొత్తుల విషయంలో తాము తొందర పడదలచుకోలేదన్నారు. జాతీయ పార్టీల విషయంలో తన అభిప్రాయం ఇదేనని మహేంద్రన్‌ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. శాసనసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో!  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top