
తమిళసినిమా: చిన్న గ్యాప్ తరువాత నటుడు భరత్ మళ్లీ వరుస చిత్రాలతో వేగాన్ని పెంచారు. ఈయన నటించిన పొట్టు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా పోలీస్ అధికారిగా దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారు. లిప్పింగ్ హార్స్, ఇంక్రెడబుల్ ప్రొడక్షన్స్, దినా స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు భరత్ పోలీస్ అధికారిగా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈయన పోలీస్ పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. భరత్‌తో పాటు సురేశ్‌మీనన్, ఆదవ్ కన్నదాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని శ్రీ సెంథిల్ నిర్వహిస్తున్నారు. ఈయన నాళై ఇయక్కునార్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచారన్నది గమనార్హం.
ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సురేశ్‌బాల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈయన ఛాయాగ్రహకుడు వేల్‌రాజ్, బాలసుబ్రమణియన్‌ల శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం విజయదశమి సందర్భంగా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హీరోయిన్‌గా ఒక ప్రముఖ నటిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి పండగ రోజున విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్.శివనేశన్ తెలిపారు.