తారుమారు

Special story to heroins workouts - Sakshi

సినిమా కథల్లోలాగే సినిమా మేకింగ్‌లో కూడా ట్విస్టులుంటాయి. మన ఒళ్లో పడ్డ బంగారాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం.. మనకి వర్కవుట్‌ కాదనుకున్నది ఇంకొకరికి బీభత్సంగా వర్కవుట్‌ అవ్వడం... మనకు ఫిట్‌ కాదనుకున్నది ఇంకొకరికి హిట్‌ అవ్వడం..ఇలాంటి ట్విస్టులు మారుమారు తారుమారు.

‘ప్రాప్తమున్న తీరానికి పడవ చేరుకుంటుంది’ అన్నాడొక కవి. ‘దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్‌’ అంటాడు ఉత్తర దేశపు యతి. ‘అంతా లలాట లిఖితం’ అనుకుంటాడు వేదాంతి. ఏమైనా అటుకులు చిటుకులు మారుతుంటాయి. త్రాసులోని పళ్లేలు ఉల్టాపల్టా అవుతుంటాయి. పూలు పండ్లవుతుంటాయి. పండ్లు పేస్ట్రీలవుతుంటాయి. రజనీకాంత్‌ అన్నట్టు ‘దక్కేది దక్కకుండా పోదు దక్కనిది ఎన్నటికీ దక్కదు’. 

మొన్న చూడండి... ‘ఆర్‌ ఎక్స్‌ హండ్రెడ్‌’ పెద్ద హిట్‌ అయ్యింది. దర్శకుడు తెలియదు... హీరో తెలియదు... హీరోయిన్‌ తెలియదు... కాని రెండు కోట్లతో తీసిన సినిమాకు 10 కోట్లు వచ్చాయని టాక్‌. ఈ సినిమా మొదట హీరో నిఖిల్‌ దగ్గరకు పోయిందట. సుధీర్‌ దగ్గరకు కూడా పోయిందట. కాని వాళ్లు రిజెక్ట్‌ చేశారు. ఆ సినిమా కోసం ఫోకస్‌ చేయాల్సిన కెమెరా ఎదుట నిలవాల్సింది ‘కార్తికేయ గుమ్మకొండ’ అని విధి నిర్ణయించినప్పుడు ఇలాంటి వైచిత్రే చోటు చేసుకుంటూ ఉంటుంది.సినిమాల్లో ఇవి మామూలే. అవకాశం రానంత వరకూ ఒక బాధ. అవకాశం వచ్చి వదులుకోవాల్సినప్పుడు ఇంకో బాధ. సరిగ్గా జడ్జ్‌ చేయకుండా వదిలేసి అది కాస్త హిట్‌ అయితే ఇంకో బాధ. 

ఇంద్రగంటి మోహనకృష్ణ రెండు హిట్స్‌ ‘జెంటిల్‌మెన్‌’, ‘సమ్మోహనం’ కూడా మొదట వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. ‘జెంటిల్‌మెన్‌’ కోసం శర్వానంద్, వరుణ్‌తేజ్‌లను సంప్రదించాడు దర్శకుడు. కాని ఆ హిట్‌ నానీ అకౌంట్‌లో పడింది. ‘సమ్మోహనం’ కోసం కూడా నిఖిల్‌ని, నానిని అనుకుంటే ఆ సినిమాలోని కీలక సన్నివేశం టెర్రస్‌ సీన్‌ లాంటిది గతంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో సమంతతో తాను చేసి ఉన్నాడు కనుక నాని ఆలోచనలో పడ్డాడని ఫలితంగా ఆ మిఠాయి పొట్లం సుధీర్‌ జేబులో పడిందని సమాచారం. ‘బాహుబలి’ కోసం శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకుంటే ఆ బర్గండీ రంగు చీర ధరించే పాత్రకు రమ్యకృష్ణ హక్కుదారు కాలేదూ? సక్సెస్‌ అనే ఏనుగు మాల పట్టుకొని వీధిలోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అది మన మెడలో పడేలా చూసుకోవాలి. లేకుంటే అర్ధరాజ్యం, రాకుమారి ఎవరి పరమో అయిపోతుంది.

‘శతమానం భవతి’ మొదట సాయిధరమ్‌ తేజ్‌ దగ్గరకు వెళ్లింది. ఎందుకో వర్కవుట్‌ కాలేదు. రాజ్‌ తరుణ్‌కు కూడా ఈ సినిమా చిక్కాల్సింది. అయితే చిక్కించుకున్నవాడు శర్వానంద్‌. ఇక దర్శకుడు వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం మొదట అనుకున్నది ఎన్‌.టి.ఆర్‌ను అన్న సంగతి తెలిసిందే. జరిగిపోయిన సినిమాల కథ ఇలా ఉంటే జరుగుతున్న సినిమాల కథ కూడా కుతూహలం రేపుతోంది. శ్రీను వైట్ల ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’గా రవితేజను చూపించాలని సినిమా మొదలుపెట్టారు. హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకున్నారు. కాని అనూకు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలకు ఏవో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వివాదం ఎటుపోయి ఎటు వస్తుందని అనుకున్నారో ఏమో అనూ ఇమ్మాన్యుయేల్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తూ నాగచైతన్యతో ‘ శైలజారెడ్డి అల్లుడు’ చేస్తున్నాను. ఆ డేట్స్‌ రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ డేట్స్‌తో క్లాష్‌ అవుతున్నాయి. అందుకే రవితేజ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అన్నారు. వాస్తవం ఏదైనా ఈ అవకాశం 
ఇలియానాకు ప్రాప్తమైంది. బాలీవుడ్‌కు వెళ్లి తెలుగుకు ఆరేళ్లుగా దూరంగా ఉన్న ఇలియానా ఈ సినిమాతో మళ్లీ కనిపించనుందని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ రిలీజ్‌ డేట్‌ కోసం, బుక్‌ మై షోలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇలా పాత్రలు మారే తీరు 
తమిళంలో ఇంకా ఊపు మీద ఉంది. దర్శకుడు సి.సుందర్‌ అక్కడ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ అనే సినిమా పనులు మొదలెట్టారు. లీడ్‌ రోల్‌ శ్రుతిహాసన్‌కు వెళ్లింది. జయం రవి, ఆర్య కీలక పాత్రలు. అంతా హ్యాపీనే అనుకుంటూ ఉన్నప్పుడు ట్విస్ట్‌ వచ్చింది.  ‘సంఘమిత్ర’ టీమ్‌తో తనకు సెట్‌ కావడం లేదని, ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌  ఇవ్వలేదని, క్యాలెండర్‌ డిటేల్స్‌ కూడా చెప్పలేదని శ్రుతి ఆరోపించారు. సినిమా నిర్మాతలు ఇంకో వెర్షన్‌ చెప్పారు.  శ్రుతితో ఎఫెక్టివ్‌గా పని చేయలేమని మేమే నిర్ణయించుకున్నాం అన్నారు. మరి సంఘమిత్ర పాత్రను ఎవరు చేయబోతున్నారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నయనతార, అనుష్క, హన్సిక ఇలా సౌత్‌లో చాలామంది టాప్‌ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఫైనల్‌గా ‘ఎం.ఎస్‌.ధోని’లో నటించిన దిశా పాట్నీకి ఆ చాన్స్‌ వెళ్లింది. త్రిష కూడా ఇటీవల ఇలాగే తప్పుకున్నారు. విక్రమ్‌ హీరోగా ఆమె హీరోయిన్‌గా హరి దర్శకత్వంలో ‘సామీ స్క్వేర్‌’ అనే సినిమా మొదలైంది. ఇది గతంలో పెద్ద హిట్టయిన ‘సామీ’కి సీక్వెల్‌. మొదటి భాగంలో నటించినందున తనను రిపీట్‌ చేశారని త్రిష అనుకున్నట్టున్నారు. అయితే నిర్మాతలు కీర్తి సురేష్‌ను హీరోయిగా తీసుకుని త్రిష చేస్తున్నది సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అనే హింట్‌ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే ఇది పూలమ్మిన చోట కట్టెలమ్మడం అవుతుంది. దాంతో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ పేరుతో త్రిష తప్పుకుంటే ఆ నూకలు ‘ఐశ్వర్య రాజేష్‌’కు దక్కాయి. ఇలా తమిళ సాంబారుకు తెలుగు పోపు పడిన మరో ఘటన కూడా జరిగింది. సూర్య హీరోగా కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో ఒక భారీ సినిమా మొదలైతే అందులో అల్లు శిరీష్‌ ఒక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ లండన్‌లో షూటింగ్‌కు మరో తమిళ నటుడు ఆర్య శిరిష్‌ స్థానంలో హాజరైనట్టు తెలిసింది. ఏం జరిగిందో తెలియదు కానీ డేట్స్‌ ప్రాబ్లమ్‌తో నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను అని అల్లు శిరీష్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

దర్శకుల విషయంలో కూడా మార్పుచేర్పులు జరగడం ఇటీవల జరుగుతోంది. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కు మొదట దర్శకుడిగా సంపత్‌ నందిను అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాబీకి దక్కింది. ‘కాటమరాయుడు’ కోసం ఎస్‌.జె.సూర్య సైన్‌ చేశారు. కానీ షూటింగ్‌ కూడా మొదలయ్యే దశలో ఆ అవకాశం కిశోర్‌ పార్థసాని (డాలీ)కు దక్కింది. హిందీలో హిట్‌ అయిన ‘క్వీన్‌’ దక్షిణాది భాషల్లో రీమేక్‌ అవుతోంది. తెలుగులో అవకాశం నీలకంఠకు వెళ్లింది. హీరోయిన్‌గా తమన్నాను తీసుకున్నారు. అయితే దర్శకునికీ హీరోయిన్‌కు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయని వార్తలు పొక్కాయి. దర్శకుడు మారాడు. నీలకంఠ స్థానంలో ‘ఆ’ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మెగాఫోన్‌ను ధరించాడు. సినిమా పేరు ‘దటీజ్‌ మహాలక్ష్మి’. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఎన్‌.టి.ఆర్‌ బయోపిక్‌ తేజ దర్శకత్వంలో హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. కాని కొన్ని రోజులకు ఈ సినిమా నుంచి తేజ తప్పుకోనున్నారట అనే లీకులు వినిపించాయి. చివరికి ఈ లీకులే నిజమైయ్యాయి. ఆ స్థానంలో దర్శకుడు క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) డైరెక్ట్‌ చేస్తున్నారు. 

నిర్మాత అయినా దర్శకుడు అయినా హీరో అయినా ఒక సినిమా గురించి ఆలోచించినప్పుడు మొదట కోరుకునేది సక్సెస్‌నే. కొన్ని పాత్రలు కొందరు చేస్తే బాగుంటుందని అనుకోవచ్చు. కాని అన్నిసార్లు అది కుదరక పోవచ్చు. వాటిని దక్కించుకున్నవారు అనుకున్నవారి కంటే బాగా చేసి మెప్పించవచ్చు. తెర వెనుక జరిగే ఈ విషయాలు సినీ అభిమానులకు ఆసక్తి కలిగించేవే. కాని థియేటర్‌లో వారు ప్రేక్షకులుగా కూచున్నప్పుడు తెర మీద ఏం కనిపిస్తున్నది తమను ఎలా మెప్పిస్తున్నదే ముఖ్యం. మార్పుచేర్పులతో కూడా సినిమాకు మంచే జరగాలని కోరుకుందాం.

భానుమతి బదులు సావిత్రి
పాత రోజులలో కూడా చాలా రీప్లే్లస్‌మెంట్స్‌ ఆర్టిస్టులకు లాభించాయి. ‘మిస్సమ్మ’లో మొదట భానుమతిని అనుకుని కొంచెం షూటింగ్‌ తర్వాత ఆమెను తొలగించి సావిత్రిని తీసుకున్నారు. ఆ సినిమాతో ఆమె స్టార్‌ అయ్యింది. అలాగే జానపదాలకు పేరు గడించిన అక్కినేనిని మొదట ‘పాతాళభైరవి’కి అనుకున్నారు. కానీ ఎన్‌.టి.ఆర్‌. తోటరాముడుగా స్టార్‌ అయ్యారు. సాంఘికాలతో గుర్తింపు పొందుతున్న ఎన్‌.టి.ఆర్‌ను ‘దేవదాసు’కు అనుకున్నారు. ఎ.ఎన్‌.ఆర్‌ ఆ పాత్ర వేసి కీర్తి పొందారు. ‘రక్తసంబంధం’ సినిమా మొదట ఎ.ఎన్‌.ఆర్‌కు వెళ్లింది. కానీ చెల్లెలి పాత్రలో సావిత్రి ఉంటే తమ జంటను యాక్సెప్ట్‌ చేయరేమో అన్న సందేహం ఆయన వ్యక్తం చేశారు. ఆ పాత్ర ఎన్‌.టి.ఆర్‌కు చాలా పేరు తెచ్చి పెట్టింది.  ‘సాగర సంగమం’లో హీరోయిన్‌ వేషం మొదట జయసుధకు వెళ్లింది. కానీ జయప్రదకు ఆ పాత్ర రాసి పెట్టి ఉంది. ‘పడమటి సంధ్యారాగం’లో హీరోయిన్‌గా చేయాల్సింది సుహాసిని. కానీ ఎంతో చక్కగా ఆ పాత్ర పోషించి విజయశాంతి పేరు తెచ్చుకున్నారు.  ‘ఖైదీ’ సూపర్‌స్టార్‌ కృష్ణ చేయాల్సింది. కానీ చిరంజీవికి దక్కి పెద్ద స్టార్‌ అయ్యారు. ‘సమరసింహారెడ్డి’ కథ మొదట వెంకటేశ్‌ దగ్గరకు వెళ్లింది. కానీ బాలకృష్ణ ఆ పాత్రతో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఇక రవితేజతో చేయాల్సిన ‘పోకిరి’ మహేశ్‌బాబుకు దక్కి ఆయన కెరీర్‌ను ఎంత మలుపు తిప్పిందో తెలిసిందే.
– సినిమా డెస్క్, ఇన్‌పుట్స్‌: శివాంజనేయులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top