'గృహం' మూవీ రివ్యూ

Siddharth Gruham Movie review - Sakshi - Sakshi - Sakshi - Sakshi

టైటిల్ : గృహం
జానర్ : హర్రర్
తారాగణం : సిద్ధార్థ్‌, ఆండ్రియా, సురేష్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అనీషా ఎంజెలీనా విక్టర్
సంగీతం : గిరీష్ వాసుదేవ‌న్‌
దర్శకత్వం : మిలింద్ రావ్‌
నిర్మాత : సిద్ధార్థ్‌

తెలుగు తెరమీద హర్రర్ సినిమాలకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ జానర్ లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే అప్పుడప్పుడు స్టార్ హీరోలు కూడా ఈ జానర్ సినిమాల మీద దృష్టి పెట్టారు. తాజాగా నాగార్జున లాంటి సీనియర్ హీరో కూడా దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో సక్సెస్ సాధించటంతో మరోసారి హర్రర్ జానర్ అదరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ కు స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ తన రీ ఎంట్రీ కోసం హర్రర్ జానర్ నే ఎంచుకున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సిద్ధార్థ్ కు సక్సెస్ ఇచ్చిందా..? 

క‌థ:
సినిమా 1934 కాలంలో మొదలవుతుంది. ఓ చైనా వ్యక్తి ఇంట్లో ఓ గర్భవతితో పాటు ఆమె కూతురు నివసిస్తుంటారు. వెంటనే సినిమా 2016కు మారుతుంది. సర్జన్ కృష్ణ కాంత్(సిద్ధార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి రోషినీ వ్యాలీలోని బంగ్లాకు మారతారు. వారి పక్కింట్లోకి ఓ కుటుంబం అద్దెకు వస్తుంది. వారిలో జెన్నీ అనే అమ్మాయి కృష్ణకుమార్ ను ఇష్టపడుతుంది. అదే సమయంలో వారి ఫ్యామిలీ, కృష్ణ కాంత్ ల కుటుంబాలు దగ్గరవుతాయి. కొద్ది రోజులకు జెన్నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది.  కృష్ణ సలహాతో జెన్నిని సైక్రియాటిస్ట్ కు చూపిస్తారు. అదే సమయంలో వారి  ఇంట్లో ఓ చైనా మహిళ, ఆమె కూతురు ఆత్మలు ఉన్నాయన్న నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఆ దెయ్యాలు ఎవరు..? వాటికి జెన్నీకి సంబంధం ఏంటి..? పాల్, కృష్ణలు జెన్నిని ఎలా కాపాడారు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
నా సినిమాకు 18 ఏళ్ల లోపు వారు రావొద్దు అంటూ తానే స్వయంగా ప్రకటించిన హీరో సిద్ధార్థ్ అదే స్థాయి హర్రర్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి సినిమాలకు నటీనటుల ఎంపిక చాలా కీలకం ప్రధాన పాత్రలో తానే నటించిన సిద్ధార్థ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తనకు అలవాటైన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భయపెట్టే సీన్స్ లోనూ అదే స్థాయి నటన కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సిద్ధార్థ్ నటన వావ్ అనిపిస్తుంది. హీరోయిన్ గా ఆండ్రియా అందంతో పాటు అభినయంలోనూ పరవాలేదనిపించింది. పాల్ పాత్రలో అతుల్ కులకర్ణి తనదైన నటనతో మెప్పించాడు.  ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. బాలనటి అలీషా ఏంజెలినా విక్టర్ అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది.

విశ్లేషణ :
ఈ సినిమాతో నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించాలన్న సిద్ధార్థ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. తన స్నేహితుడు మిలింద్ రావ్ ను దర్శకుడిగా ఎంచుకున్న సిద్ధార్థ్ నటుడిగానే కాక మేకింగ్ లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నాడు. హాలీవుడ్ స్థాయి హర్రర్ సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన మిలింద్ రావ్ సూపర్బ్ విజువల్స్ తో భయపెట్టాడు. సినిమా అంతా డిఫరెంట్ టింట్, కలర్ మోడ్ లో సాగటంతో హాలీవుడ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథనం కాస్త నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. హర్రర్ సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా ఇంపార్టెంట్. శ్రేయాస్ కృష్ణ సూపర్బ్ సినిమాటోగ్రఫి సినిమా స్థాయిని పెంచింది. అందుకు తగ్గట్టుగా గిరీష్ వాసుదేవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెట్టింది. రొమాంటిక్ సీన్స్ ను కూడా కాస్త ఘాటుగానే తెరకెక్కించారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ హర్రర్ సినిమాను అందించే ప్రయత్నం చేశారు. కామెడీ, డ్రామా లాంటి అంశాలను ఆశించే వారిని ఈ సినిమా ఏ మాత్రం అలరించదు.

ప్లస్ పాయింట్స్ :
సిద్ధార్థ్ నటన
కథ, టేకింగ్

మైనస్ పాయింట్స్:
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
స్లో నేరేషన్

-సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్ నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top