నాన్న.. తందె.. బాప్!

నాన్న.. తందె.. బాప్!


తమిళంలో ‘అప్పా’ అంటే నాన్న అని అర్థం. ఏ భాషలో పిలిచినా పిల్లల పట్ల నాన్న ప్రేమ ఆల్‌మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. ఇది ఫాదర్స్ డే కాకపోయినా నాన్న గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... తమిళ దర్శకుడు సముద్రఖని ‘అప్పా’ పేరుతో ఓ సినిమా తీశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్‌ని తానే చేశారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదలు పెట్టినప్పుడు పన్నెండు భారతీయ భాషల్లో తీయాలనుకున్నారట.



తమిళ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రీమేక్ సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి  తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఒక తండ్రీ కొడుకు, విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే ఇది. సముద్రఖని జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఇతర భాషల రీమేక్‌లో ఏ హీరో చేస్తే బాగుంటుందనే విషయంలో సముద్రఖని ఓ స్పష్టతకు వచ్చారు.



తెలుగులో ‘అప్పా’గా వెంకటేశ్ న్యాయం చేయగలరన్నది సముద్రఖని అభిప్రాయం. కథ, పాత్ర నచ్చితే వెంకీ తండ్రిగా నటించడానికి వెనకాడడం లేదు. ‘దృశ్యం’ చిత్రంలో ఏకంగా టీనేజ్ గాళ్‌కి తండ్రిగా చేసిన విషయం తెలిసిందే. ఓ తండ్రిగా ఆ సినిమాలో పిల్లల పట్ల ప్రేమ కనబర్చే సన్నివేశాల్లో వెంకీ చాలా టచింగ్‌గా నటించారు. ‘అప్పా’ గురించి వెంకీతో సముద్రఖని చర్చలు జరిపారట. ఈ సినిమాలో వెంకీయే నటించే అవకాశం మెండుగా ఉందని వార్త. కన్నడ రీమేక్‌కి హీరో శివరాజ్‌కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హిందీలో అనిల్ కపూర్ అయితే బాగుంటుందని సముద్రఖని అనుకుంటున్నారట.



తమిళ ‘అప్పా’ చూసిన తర్వాత, నచ్చితే తప్పక చేస్తానని అనిల్ మాటిచ్చారట. తెలుగు, కన్నడాల్లో ఎవరు నిర్మిస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే, ‘అమ్మా కనక్కు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వినీ అయ్యర్ తివారీ హిందీలో నిర్మించడానికి ముందుకొచ్చారు. ఆవిడ మాత్రం టైటిల్ రోల్‌ను ఇర్ఫాన్‌ఖాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి.. హిందీ బాప్‌గా ఎవరు నటిస్తారో చూడాలి. ఈ మూడు రీమేక్స్ సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందుతాయి. కన్నడంలో నాన్నని ‘తందె’ అంటారు. హిందీలో ‘పితా’, ‘బాప్’ అంటారు. టైటిల్స్ కూడా అందుకు తగ్గట్లే పెడతారేమో.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top